

హైదరాబాద్: ఎంతమంది నాయకులు వచ్చినా.. ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా అవన్నీ మాజీ సీఎం ఎన్టీఆర్ చేసినవేనని ఆయన తనయుడు, సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు, ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించారు.
అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ.. భూమ్మీద ఎంతో మంది పుడతారు.. గిడతారు కానీ అందరూ మహానుబావులు కాలేరని అన్నారు. ఒక మనిషి మహోన్నతుడు కావాలంటే అకుంఠిత దీక్ష, సత్సంకల్పం కావాలని, నమ్మినదారిలో ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు నడవాలని ఎన్టీఆర్ రుజువు చేశారని బాలకృష్ణ అన్నారు.
లంచగొండితనం ఇష్టం లేక ఎన్టీఆర్ తన ప్రభుత్వోద్యాగానికి రాజీనామా చేశారని బాలకృష్ణ చెప్పారు. సినిమాల్లో ఎదురులేకుండా సాగిన ఆయన.. రాజకీయాల్లోనూ అంతే స్థాయిలో వెలుగొందారని, పార్టీ పెట్టిన 9నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారని బాలకృష్ణ గుర్తు చేశారు.
బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన వారికి రాజ్యాధికారాన్ని అందించిన ఘనత ఎన్టీఆర్‌దేనని బాలయ్య అన్నారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ మనతోనే ఉంటారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాల కోసం పనిచేస్తామన్నారు.
నివాళుర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్: భావోద్వేగం
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద శుక్రవారం ఉదయం నివాళులు అర్పించారు. నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, నారా బ్రాహ్మణి, సుహాసినితోపాటు సినీ దర్శకుడు క్రిష్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. నివాళులర్పించిన అనంతరం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవలే వీరి తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.








