
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసు విషయలో.. ఏపీ ప్రభుత్వం పాత్రపై అనుమానాలున్నాయని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ కేంద్రంగా జరిగిన ఈ భారీ డాటా కుంభకోణం వెనక ఎవరున్నా ఉపేక్షించేది లేదని సజ్జనార్ స్పష్టం చేశారు. అవసరమైతే అక్కడి మంత్రులు, అధికారులకూ నోటీసులు జారీచేస్తామని చెప్పారు.
ఈ కేసు దర్యాప్తును అడ్డుకోవడానికి ఏపీ పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారని, ఫిర్యాదుదారుడు లోకేశ్వర రెడ్డిపై వారి ప్రవర్తనకు సంబంధించి కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. ప్రాథమికంగా డేటా చోరీ అయినట్లు కేసు నమోదు చేసినా.. ప్రభుత్వంతో ఉన్న అవగాహన ఒప్పందం నేపథ్యంలోనే ఈ సమాచారమంతా ఐటీ గ్రిడ్స్‌కు చేరిందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉండాల్సిన కీలక సమాచారాన్ని సేకరించిన ఐటీ గ్రిడ్స్ సంస్థ దాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ డేటా అనలిస్ట్ తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే విచారించిన నలుగురు సంస్థ ఉద్యోగుల్ని కేవలం సాక్ష్యులుగానే పరిగణించాలని నిర్ణయించిన పోలీసులు అశోక్‌ను పట్టుకోవడంపైనే దృష్టి సారించారు.
నోటీసులు ఇచ్చినా అశోక్ విచారణకు హాజరు కాకపోవడంతో నాలుగు బృందాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో వేట ముమ్మరం చేశారు. అశోక్ చిక్కితేనే ఆంధ్ర ప్రజల డేటా ఎలా సమకూరింది? ఎవరైనా ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందా? ఉన్నతాధికారులెవరైనా సహకరించారా? ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేశారా? సదరు సమాచార మార్పిడిపై ఆంధ్ర ప్రభుత్వంతో సంస్థకు ఏమైనా ఒప్పందం ఉందా? అనే విషయాలపై స్పష్టత వస్తుందని, అవే కేసులో కీలకమవుతాయని చెప్పారు.
సోమవారం గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో ఐటీ గ్రిడ్ సంస్థపై నమోదైన కేసు విచారణ వివరాలను సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఐటీ గ్రిడ్ సంస్థ ఏపీ ప్రజలకు సంబంధించిన రహస్య, వ్యక్తిగత సమాచారాన్ని చోరీచేసి అక్రమాలకు పాల్పడుతున్నట్టు మూడురోజులుగా సాగుతున్న విచారణలో బయపడుతోందని చెప్పారు.
కేపీహెచ్‌బీ ప్రాంతానికి చెందిన తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు నాలుగుబృందాలతో కేసు దర్యాప్తు చేపట్టామని, ఐటీగ్రిడ్ సంస్థలో జరిపిన సోదాల్లో ఐ బాల్, సీపీ యూ, కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, ఎమ్ క్యాబ్ సీరిస్ తదితర పరికరాలు, పత్రాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
ఇందులో కొన్నింటి పాస్‌వర్డ్స్, ఐడీలను తెలుసుకొనేందుకు సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్టు చెప్పారు.
ఈ సంస్థలో పనిచేస్తున్న రేగొండ భాస్కర్, కడులూరి ఫణికుమార్, రెబ్బలా విక్రంగౌడ్, గురుడు చంద్రశేఖర్‌ను సాక్షులుగా నమోదుచేసినట్టు తెలిపారు. వారిని విచారించగా ఐటీ గ్రిడ్ సంస్థ టీడీపీ కోసం సేవామిత్ర యాప్‌ను తయారుచేసినట్టు నిర్ధారణ అయిందన్నారు.
చర్యలు తప్పవంటూ ఏపీ పోలీసులకు వార్నింగ్
నియోజకవర్గాలవారీగా ఓటర్లు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు, ఓటర్లు వైసీపీ, జనసేన, టీడీపీలలో ఏ పార్టీకి చెందినవారు, ఎవరికి ఓటేసేందుకు మొగ్గుచూపుతారు అని సర్వేల ద్వారా సేకరించిన సమాచారాన్ని డాటాలో ఉంచారని, ఓటరు చిరునామా, ఏ కులం, మతానికి చెందినవారు సమాచారం కూడా యాప్‌ద్వారా సేకరించారని తెలిపారు.
రహస్యంగా ఉండాల్సిన ఆధార్‌కార్డు వివరాలు కూడా ఈ యాప్‌లో ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని సీపీ వెల్లడించారు. ప్రభుత్వం వద్ద భద్రంగా ఉండాల్సిన పౌరు ల వ్యక్తిగత, రహస్య చిట్టా వీరివద్ద అక్రమం గా ఉండటం వెనుక భారీకుట్ర దాగిఉన్నదని అనుమానిస్తున్నామని చెప్పారు.
ఈ సమాచారంతోనే చాలాఓట్లు డిలీట్ అయ్యాయనే ఆరోపణలు ఏపీలో వెల్లువెత్తుతున్నాయని, వీటిపై ఆ రాష్ట్రంలో 40 నుంచి 50 కేసులు కూడా నమోదైనట్టు కచ్చితమైన సమాచారం ఉన్నదని సజ్జనార్ వివరించారు. ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా దర్యాప్తును సజావుగా సాగిస్తామని, ఇందులో నిందితులుగా ఉన్న ఎవర్నీ వదిలిపెట్టబోమని తెలిపారు. ఏపీ పోలీసులపై కూడా చట్టబద్దంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏపీ పోలీసులు ఐటీ గ్రిడ్ కేసులో ఫిర్యాదుదారులు, సాక్షులను బెదిరించడంపై సీపీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐటీ గ్రిడ్ సంస్థలో జరిపిన సోదాల్లో సమయంలో సాక్షులుగా ఉన్న ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి వారితోపాటు వారి తల్లిదండ్రులను ఏపీ పోలీసులు బెదిరించడం సరికాదన్నారు. కేసు విషయంలో విచారణకు వారిని పిలిపిస్తే.. కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేయించారని అన్నారు.
ఐటీ గ్రిడ్ సంస్థ అక్రమంగా ప్రజలకు సంబంధించిన రహస్య, వ్యక్తిగత, లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించుకున్న వైనంపై సైబరాబాద్ పోలీసులు ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాయనున్నారు. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన డాటాను ఏపీలో ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఆ సమాచారం మొత్తం ఎవరి భద్రతలో ఉంటుంది, వ్యక్తిగతస్వేచ్ఛకు, భద్రతకు భంగం కలిగించేలా డాటా బయటి సంస్థలకు ఎలా చేరింది.. అనే అంశాలను లేఖలో ప్రస్తావించనున్నారు.
అంతేగాక, మిస్సింగ్ కేసు దర్యాప్తు పేరుతో హైదరాబాద్‌కు వచ్చి ఫిర్యాదుదారులు, సాక్షులను బెదించిన ఏపీ పోలీసుల తీరుపై ఆ రాష్ట్ర డీజీపీకి కూడా లేఖ రాయనున్నట్టు సజ్జనార్ తెలిపారు. కాగా, ఐటీ గ్రిడ్ సంస్థ తాము క్రోడీకరించుకున్న సమాచారాన్ని అమెజాన్ వెబ్ సర్వీసులో భద్రపర్చుకునట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ సమాచారం ఇవ్వాలంటూ సైబరాబాద్ పోలీసులు అమెజాన్ సంస్థకు లేఖ రాశారు.
చదవండి: ఏపీ పోలీసులకు ఇక్కడేం పని? అంత ఉలుకెందుకు?: బాబు, ఉత్తమ్‍లపై కేటీఆర్ ఫైర్…








