
గుంటూరు: సార్వత్రిక ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు టీడీపీని వీడగా.. ఇప్పుడు మరో నేత కూడా అదేబాటలో పయనమయ్యారు. తెలుగుదేశం పార్టీకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి రాజీనామా చేశారు.
మంగళవారం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. లేఖల్ని చంద్రబాబుకు, అసెంబ్లీ స్పీకర్‌కు పంపారు. తన వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నానని.. ఆమోదించాలని కోరారు. కాగా, అంతకుముందు మంగళవారం పార్టీ అధ్యక్షులతో సమావేశమయ్యారు.
టీడీపీలో తనకు ఎదురైన అవమానాలను చెప్పుకుని మోదుగుల కన్నీటిపర్యంతమయ్యారట. తనకు గౌరవం లేని చోట ఉండలేనని.. ఇప్పటి వరకు చంద్రబాబు ఫోన్ చేస్తారేమోనని ఎదురుచూశానన్నారట. అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందానని.. అందుకే పార్టీ వీడుతున్నట్లు చెప్నినట్లు తెలిసింది.
వైసీపీ నుంచే పోటీ..
టీడీపీపై అలకబూనిన మోదుగుల… గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఎన్నికల సమయంలో కీలకంగా నిర్వహించే రివ్యూ సమావేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే.
త్వరలోనే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో వేణుగోపాల్‌రెడ్డి భేటీ అవుతారని తెలుస్తోంది. అనంతరం వైసీపీ కండువా కప్పుకోవాలని భావిస్తున్నారట. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2009లో టీడీపీ నుంచి నర్సరావుపేట ఎంపీగా గెలిచారు.
రాయపాటి సాంబశివరావు రాకతో.. 2014 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో మోదుగుల వైసీపీ నుంచి గుంటూరు లేదా నరసరావుపేట ఎంపీగా పోటీచేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.








