
అమరావతి: మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వైసీపీ నేతలు టీడీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని, వాటిని విచారించి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు వేలాది కోట్ల ఖనిజ సంపద దోచుకున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక విధానంతో ప్రభుత్వానికి నష్టం వస్తే టీడీపీ నేతలు మాత్రం బాగా లాభపడ్డారని ఆరోపించారు.
అందుకే ఇసుక అక్రమాలు జరిగిన చోట్లంతా టీడీపీ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. ఇక 15 రోజుల్లో కొత్త ఇసుక పాలసీ తీసుకొస్తామని, ప్రభుత్వ ఆదాయంలో 25 శాతం ఆదాయం ఖనిజాల నుంచి వచ్చేలా కొత్త పాలసీ రూపొందిస్తామని మంత్రి చెప్పారు.
అలాగే ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపివేస్తామని, అక్రమ తరలింపుల విషయంలో జిల్లా అధికారులే బాధ్యత వహించాలని అన్నారు.








