
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ వేవ్ బలంగా వీచింది. ఆ దెబ్బకి టీడీపీ ఘోరపరాజయం చవిచూసింది. ఆ పార్టీ కేవలం 23 స్థానాలకి పరిమితమైంది. అయితే ఇంతటి వేవ్ లోనూ వైసీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ నేత ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓటమి పాలయ్యారు.
ఈయన గెలిస్తే ప్రభుత్వంలో ఏదొక పదవి ఖాయమని పార్టీలో చర్చ నడిచింది. కానీ దురదృష్టం కొద్దీ పర్చూరు నుంచి దగ్గుబాటి కేవలం 1503 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు.
అయితే జగన్ వేవ్ లోనూ దగ్గుబాటి గెలవకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. దగ్గుబాటి సక్రమంగా ప్రచారం చేయకపోవడం, డబ్బులు ఖర్చు పెట్టకపోవడం వల్లనే ఓటమిపాలయ్యారని ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు.
కాగా, రాజకీయాలకు దూరంగా ఉన్న దగ్గుబాటి…మొదట తన తనయుడు హితేష్ చెంచురామ్‌ని పర్చూరు నుంచి పోటీ చేయించాలని భావించి వైసీపీలో జాయిన్ చేశారు. అయితే హితేష్ కు అమెరికా పౌరసత్వం ఉండటం, చివరి నిమిషం వరకూ అది రద్దు కాకపోవడంతో జగన్ సూచన మేరకు ఆయనే స్వయంగా బరిలోకి దిగాల్సి వచ్చింది.
ఆ విధంగా పర్చూరు బరిలో దిగిన దగ్గుబాటి గెలిస్తే…స్పీకర్ పదవి గ్యారెంటీ అనుకున్నారు. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ చివరికి టీడీపీ యువనాయకుడు చేతిలో దగ్గుబాటి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.








