
విజయవాడ: ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి కేశినేని నాని విజయవాడ ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఆయన గెలిచిన దగ్గర నుంచి టీడీపీ అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు ఇచ్చిన లోక్‌సభ విప్‌ని తిరస్కరించిన నాని…తన ఫేస్‌బుక్ ఖాతాలో సొంత పార్టీని టార్గెట్ చేసుకుని రోజుకో పోస్ట్ పెడుతున్నారు. మొన్న కొడాలి నాని తనని మంత్రి చేసిన దేవినేని ఉమాకు కృతజ్ఞుడిగా ఉండాలని పోస్ట్ చేసి….దేవినేనిపై సెటైర్ వేశారు.
ఇప్పుడు తాజాగా మరో పోస్ట్ పెట్టారు. “నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం.
నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలిసిన వాడిని.
నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాడిని నేను. నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని. భయం నా రక్తంలో లేదు. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు. ఎవరెన్ని పెడార్థాలు తీసిన, వీపరీతార్థాలు తీసిన లెక్క చేసే వాడిని కాదు” అని నాని పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ ఎవరిని టార్గెట్‌గా పెట్టుకుని చేశారనేది అర్ధం కాకుండా ఉంది.








