విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నుంచి రెండ్రోజుల పాటు విజయవాడలో విస్తృతంగా పర్యటించనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పోరాటయాత్రలో పాల్గొంటున్నారు. విజయవాడలో పవన్ పర్యటన కోసం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయవాడ పర్యటన నేపథ్యంలో పవన్.. తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న తన పోరాటయాత్రకు విరామం ఇచ్చి.. శనివారం విజయవాడకు రానున్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తన విజయవాడ పర్యటనలో… జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలతో పవన్ చర్చించనున్నారు.
అనంతరం పవన్ కళ్యాణ్ నవంబర్ 12న తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లి తిరిగి తన పోరాట యాత్ర కొనసాగిస్తారు. ఆయన పోరాటయాత్రలో భాగంగా అక్రమ మైనింగ్ సహా పలు సమస్యలను ప్రస్తావిస్తున్నారు. కాగా, విజయవాడకు రానున్న పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలికేందుకు జన సైనికులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.