స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో భారత్‌కు.. ప్రపంచంలోనే రెండో స్థానం!

- Advertisement -

India Reached Now Worlds Second Largest Mobile Phone Producer

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో భారత్ రెండోస్థానానికి ఎగబాకింది. 2018 జూలై – సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ అమెరికాను కిందికి నెట్టేసినట్టు మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘కనాలిస్’ తాజా నివేదిక వెల్లడించింది.

2018లో మూడో త్రైమాసికంలో భారత్‌ 4 కోట్లకుపైగా యూనిట్లను రవాణా చేయగా.. చైనా 10 కోట్లకుపైగా యూనిట్లను ఎగుమతి చేసి.. స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది.

‘‘భారత్ ఈ త్రైమాసికంలో అమెరికాను కిందికి నెట్టి ప్రపంచ రెండో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రెండు దేశాల్లోనూ మార్కెట్ బలహీనంగా ఉన్నప్పటికీ భారత్ రెండో స్థానంలో నిలిచింది..’’ అని తాజా కానాలిస్ నివేదిక పేర్కొంది.

గత ఏడాదితో పోల్చితే.. ప్రపంచవ్యాప్తంగా జూలై – సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్‌ ఫోన్ ఎగుమతులు 34.89 కోట్ల మేర (7.2 శాతం) తగ్గాయి. 2015 తర్వాత మూడో త్రైమాసికంలో మార్కెట్ ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి అని కూడా ‘కానాలిస్’ నివేదిక పేర్కొంది.

కారణాలు అనేకం…

అయితే స్మార్ట్ ఫోన్ రీప్లేస్‌మెంట్ కాలం ఎక్కువగా ఉండడం, ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్య రంగం మందగమనంలో ఉండడం, చైనా ప్రధాన విక్రేతల మధ్య పోటీ తదితర కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టు ఆ నివేదిక వివరించింది. దీంతో టాప్ టెన్ మార్కెట్లలో కేవలం మూడు మార్కెట్లు మాత్రమే వృద్ధిని నమోదు చేశాయి.

అంతేకాదు, ప్రపంచ మార్కెట్లో ఇండోనేషియా 89 లక్షల యూనిట్లు (13.2 శాతం), రష్యా 88 లక్షల యూనిట్లు (11.5 శాతం), జర్మనీ 55 లక్షల యూనిట్లు (2.4 శాతం) వృద్ధిని నమోదు చేశాయి. ప్రస్తుతం టాప్ 3 లిస్టులో ఉన్న చైనాలో 15.2 శాతం, భారత్‌లో 1.1 శాతం, అమెరికాలో 0.4 శాతం మేర  మార్కెట్లలో ఎగుమతులు పడిపోయాయి.

- Advertisement -