తూర్పుగోదావరి: ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు పొత్తుల పేరు చెప్పుకుని ఆంధ్రప్రదేశ్‌కి తివ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం సిగ్గుచేటని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు.
తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో పోత్తులు విషయంలో సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు.
అవినీతిని ఆధారాలతో సహా చూపిస్తోంటే.. ఆ మౌనం ఏమిటి?
దాదాపు ఐదు రోజులుగా తాను కేవీరావు అక్రమాలపై ఆధారాలతో సహా విరుచుకుపడుతుంటే.. అటు సీఎం చంద్రబాబు నాయుడుగానీ, ఇటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌గానీ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అలాగే పర్యావరణాన్ని దెబ్బతీస్తూ, మత్స్యకారుల సంపదను కొల్లగొడుతున్న కేవీరావు అవినీతిపై సీఎం చంద్రబాబు, జగన్‌ల మౌనానికి అర్థం ఏమిటంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు, జగన్‌ల మౌనం చూస్తుంటే వారిద్దరికీ అవినీతిలో వాటాలు ఉన్నాయనిపిస్తోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. చిన్న సినిమా థియేటర్ నడుపుకునే కేవీ రావుకు సీపోర్ట్ ఎలా వచ్చిందో తేలుస్తానన్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అన్ని రోడ్లు, లైట్లు తనే వేశానని, తాను చేసిన అభివృద్ధి నీడలో అందరూ బతుకుతున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడు అనడం సిగ్గుచేటని కూడా పవన్ కాల్యాణ్ మండిపడ్డారు.