
అమరావతి: రేపు ఏపీ మంత్రివర్గం ప్రమాణస్వీకారం ఉన్న నేపథ్యంలో ఈరోజు సీఎం జగన్ అధ్యక్షతన అమరావతిలో వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశం సందర్భంగా సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఏపీకి ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులు ఉంటారని జగన్ వెల్లడించారు. కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు తనకు డిప్యూటీలుగా ఉంటారని జగన్ ప్రకటించగా, వారు ఎవరన్న చర్చ జోరందుకుంది.
అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, కాపు సామాజిక వర్గం నుంచి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, మైనారిటీ కోటాలో కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, ఎస్సీ వర్గం నుంచి ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ఎస్టీ వర్గం నుంచి సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, బీసీ కులాల నుంచి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధిలకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నాయని తెలుస్తోంది.
అటు ఏపీ అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాంను నియమిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని తమ్మినేని కలిసినట్టు తెలుస్తోంది. కాగా, ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి తమ్మినేని గెలుపొందారు.








