
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ చరిత్రలో లేని విధంగా 175 స్థానాల్లో పోటీ చేసి కేవలం 23 స్థానాలని గెలుచుకుంది. అలాగే 25 ఎంపీ స్థానాలకి గాను 3 గెలుచుకుంది.
అయితే ఎన్నికల్లో చావుదెబ్బ తినడంతో చాలామంది తెలుగుదేశం నేతలు అధికార వైసీపీలో చేరేందుకు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇక మరికొంత మంది నేతలు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలోనే ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ తరుపున విజయవాడ నుంచి రెండోసారి గెలుపొందిన ఎంపీ కేశినేని నాని కూడా బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
కృష్ణా జిల్లాలో టీడీపీ అభ్యర్ధులు ఘోరంగా ఓడిపోయిన నాని మాత్రం దాదాపు 8వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్ధి పీవీపీ పై విజయం సాధించారు. ఇక ఆయన విజయం సాధించిన వెంటనే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిశారు…ఆ తర్వాత కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి అభినందలు తెలియజేశారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ భేటీలు మర్యాదపూర్వకంగానే జరిగాయని నాని తెలిపారు.
ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు జరిగింది. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే పార్టీ జిల్లాలోని అగ్రనేతలు అంతా ఈ విందుకి హాజరయ్యారు.
కానీ విజయవాడలో ఉండే కేశినేని మాత్రం హాజరు కాలేదు. దీంతో ఆయన బీజేపీలో చేరుతున్నారని వార్తలకి బలం చేకూరినట్లైంది. ప్రస్తుతానికి అయితే నాని దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. మరి చూడాలి కేశినేని బీజేపీలో చేరాతరో లేక టీడీపీలోనే ఉంటారో.








