22.8 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ బాబుకి తాజా సర్వే షాక్: కేంద్రంలో ఎన్డీఏ, ఏపీలో వైసీపీ ప్రభంజనం, తెలంగాణలో టీఆర్ఎస్ హవా

బాబుకి తాజా సర్వే షాక్: కేంద్రంలో ఎన్డీఏ, ఏపీలో వైసీపీ ప్రభంజనం, తెలంగాణలో టీఆర్ఎస్ హవా

- Advertisement -

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పలు వార్తా ఛానళ్లు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తమ సర్వేలో వెల్లడించాయి. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఓపీనియన్ పోల్స్ ప్రకారం.. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కారు వస్తుందని స్పష్టం చేసింది. ఇక ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని, తెలంగాణలో టీఆర్ఎస్ హవా కొనసాగుతుందని పేర్కొంది.

కేంద్రంలో ఎన్డీఏ.. ఏపీలో వైసీపీ ప్రభంజనం

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 25 స్థానాల్లో వైఎస్సార్సీపీ 22 చోట్ల, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధిస్తాయని ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌ ఒపీనియన్‌ పోల్స్‌ వెల్లడించింది. కాగా, ఈ సర్వే అంచనాలు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు షాకిచ్చేలా ఉన్నాయి. 25కి 25 ఎంపీ స్థానాలు టీడీపీకే దక్కాలని ఇప్పటికే అధినేత చంద్రబాబు విస్తృత ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇండియా టీవీ సర్వే మాత్రం టీడీపీకి ఆందోళన కలిగించే అంశంగామారింది.

కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సాధారణ మెజారిటీ సాధించినా 2014తో పోలిస్తే సుమారు 70 సీట్లు కోల్పోయే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 272 మేజిక్‌ ఫిగర్‌ కాగా, బీజేపీ స్వతహాగా 238 చోట్ల, ఎన్డీయే కూటమి 285 సీట్లలో గెలుపొందుతుందని వెల్లడించింది.

2014లో 282 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ఈసారి 44 సీట్లను కోల్పోయి 238 స్థానాలను దక్కించుకునే అవకాశముందని తెలిపింది. గతంలో 80 స్థానాలకే పరిమితమైన యూపీయే ఈసారి తన బలాన్ని 126 సీట్లకు పెంచుకునేందుకు అవకాశాలున్నట్లు సర్వే తేల్చింది. అయితే, అప్పుడు 44 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ ఈసారీ మూడంకెల స్కోరును అందుకోవడం కష్టమేనని పేర్కొంది.

ఇక ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, టీఆర్‌ఎస్, ఇతర ప్రాంతీయ పార్టీలు సుమారు 130 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. 2014 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 16 స్థానాలు, అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వం వహిస్తున్న ఎస్పీ 18 సీట్లు కైవసం చేసుకునే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఈ రాష్ట్రంలో 2014లో 80 స్థానాలకు గాను 71 చోట్ల గెలుపొందిన బీజేపీ ఈసారి 40 చోట్ల మాత్రమే విజయం సాధిస్తుందని సర్వే తెలిపింది.

తెలంగాణలో టీఆర్ఎస్ హవా

తెలంగాణలో టీఆర్ఎస్ హవా కొనసాగే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ 14, కాంగ్రెస్‌ 2, ఎంఐఎం 1 చోట గెలుస్తాయని పేర్కొంది. 2014లో బీజేపీకి ఉన్న ఆ ఒక్క సీటు కూడా ఇప్పుడు కష్టమేనని తేల్చింది. కాగా, మార్చి 1–7 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 193 లోక్‌సభ స్థానాల్లో నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 20 వేల మంది పురుషులు, 18 వేల మంది మహిళల నుంచి సమాచారం సేకరించారు.

రాష్ట్రాల వారీగా పార్టీలు గెలుచుకునే సీట్ల సంఖ్య:

యూపీ(80): బీజేపీ 40, ఎస్పీ 18, బీఎస్పీ 16, కాంగ్రెస్‌ 4, ఆర్‌ఎల్డీ 1, అప్నా దళ్‌ 1
పశ్చిమబెంగాల్‌(42): టీఎంసీ 30, బీజేపీ 12
రాజస్తాన్‌(25): బీజేపీ 20, కాంగ్రెస్‌ 5
మధ్యప్రదేశ్‌(29): బీజేపీ 23, కాంగ్రెస్‌ 6
గుజరాత్‌(26): బీజేపీ 26: ఢిల్లీ(7): బీజేపీ 7
మహారాష్ట్ర(48): బీజేపీ 22, శివసేన 10,
కాంగ్రెస్‌ 9, ఎన్సీపీ 7
బిహార్‌(40): బీజేపీ 15, జేడీయూ 12, ఆర్జేడీ 8,
ఎల్జేపీ 3, కాంగ్రెస్‌ 2
తమిళనాడు(39): డీఎంకే 16, ఏడీఎంకే 12,
కాంగ్రెస్‌ 5, పీఎంకే 2, బీజేపీ 1
కర్ణాటక(28): బీజేపీ 13, కాంగ్రెస్‌ 13, జేడీఎస్‌ 2
కేరళ(20): యూడీఎఫ్‌ 12, ఎల్డీఎఫ్‌ 7, బీజేపీ 1

దేశ వ్యాప్తంగా 543 స్థానాల్లో పార్టీలకు వచ్చే సీట్ల సంఖ్యను పరిశీలిస్తే..

బీజేపీ: 238
కాంగ్రెస్: 82
టీఎంసీ: 30
వైఎస్సార్సీపీ: 22
ఎస్పీ: 18
బీఎస్పీ: 16
డీఎంకే: 16
టీఆర్ఎస్: 14
లెఫ్ట్ కూటమి: 6
స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీలు: 38.

- Advertisement -