
హైదరాబాద్: ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు , ప్రధాని నరేంద్ర మోడీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. బీజేపీ లో నుండి బయటకివచ్చినప్పటినుండి సీఎం బాబు మోడీ పై పలు విమర్శలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా మరోసారి మోడీ పై రెచ్చిపోయాడు.
భారతదేశం గత 70 ఏళ్లలో చూసిన ప్రధానమంత్రుల్లో అస్సలు జవాబుదారీతనం లేని వ్యక్తి నరేంద్ర మోదీయేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ విషయాన్ని మీడియా కూడా చెబుతుంది అని చెప్పుకొచ్చారు.
మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి ఇప్పటివరకు కనీసం ఓ ప్రెస్ కాన్ఫరెన్సు కూడా పెట్టలేదు అని , ఆలా ఒక్క ప్రధాని మోదీ తప్ప మరెవరూ లేరని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అంతేకాకుండా రాజ్యాంగ వ్యవస్థల మధ్య అంత:కలహాలు రేపిన ఘనత కూడా మోదీదేనని మండిపడ్డాడు.
ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ.. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశారు. ఏటిఎంలను దిష్టిబొమ్మలుగా చేశారు. డిమానిటైజేషన్ పెద్ద కుంభకోణంగా మార్చారు. వస్తుసేవల పన్ను(జీఎస్టీ) సక్రమంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. రూపాయి విలువ దారుణంగా పతనం అయ్యింది. 72 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇంత విఫల ప్రధానిని చూడలేదు అని ఘాటుగా విమర్శించారు.
గతడాది సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా సమావేశం పెట్టడంపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో మొదటిసారి నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బయటికొచ్చి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. దేశచరిత్రలో తొలిసారి సాక్షాత్తూ రక్షణశాఖ కార్యాలయంలోనే దేశ భద్రతకు సంబంధించిన పత్రాలు మాయం కావడం ఎప్పుడైనా జరిగిందా అని అయన ప్రశ్నించారు.








