
అనంతపురం: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి నోరు పారేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురంలో ఆయన శుక్రవారం రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా భారీగా హాజరైన జనసందోహాన్ని చూస్తూ ఉత్సాహంగా ప్రసంగించారు. మోడీకి సిగ్గూ, శరం లేవని, నిజంగా మగాడే అయితే తాను తిట్టే తిట్లకు సముద్రంలో దూకి చచ్చిపోవాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే కాదని, మోడీని ఇంతకుముందు కూడా తీవ్రస్థాయిలో తిట్టానని చెప్పుకొచ్చారు.
సిగ్గూ, శరం లేవంటూ..
అయినా మోడీకి సిగ్గూ, శరంలేవని వ్యాఖ్యానించారు. ‘మోడీని నేను తిట్టినట్టు దేశంలో ఎవరూ తిట్టి ఉండరు’ అని వ్యాఖ్యానించారు. గతంలో ఓసారి బాలకృష్ణ హిందీ భాషలోనే మోడీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కూడా అదేస్థాయిలో విమర్శలు గుప్పించడం గమనార్హం. తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపైనా బాలయ్య విమర్శలు చేశారు. కేసీఆర్, జగన్‌లతో కలిసి రాష్ట్రాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడంటూ మండిపడ్డారు. ఈ ముగ్గురూ కలిసి వచ్చినా తననేమీ చేయలేరంటూ ధీమా వ్యక్తం చేశారు.








