
విశాఖ:సార్వత్రిక ఎన్నికల్లో ఒక నియోజక వర్గం నుంచి స్టాండర్డ్ గా గెలిచే వ్యక్తులు ఉన్నారు. లేదంటే అదే నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా మరోసారి అదే పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలవచ్చు. అలా కాకుండా ప్రతిసారి తన నియోజక వర్గాన్ని మారుస్తూ మార్చిన పార్టీ నియోజక వర్గంలోను విజయం సాధిస్తూ వస్తే ఏమంటారు అంటే గంటా శ్రీనివాస్ అంటారు.
అదేంటి అని ఆశ్చర్యపోకండి. గంట శ్రీనివాస రావు ఇప్పటి వరకు ఐదు సార్లు పోటీ చేశారు. ఐదు సార్లు విజయం సాధించారు. ప్రతిసారి మారుతూ వస్తున్నారు. మారినా సరే విజయం వరిస్తూనే ఉన్నది. అదృష్టం అంటే ఆయనదే అని చెప్పొచ్చు. రాజకీయాల్లోకి రాకముందు గంట శ్రీనివాసరావు సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్.
ఎన్నో బిజినెస్ లు చేసి విజయం సాధించారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ కూడా విజయాలు అందుకుంటున్నాడు గంట. 1999 లో మొదట తెలుగుదేశం పార్టీ తరపున అనకాపల్లి నియోజక వర్గం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. తెలుగుదేశం పార్టీ హవా ఉండటంతో ఆయన విజయం సాధించారు.
2004 లో రంపచోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు విజయం సాధించారు. అనంతరం 2009 లో జరిగిన ఎన్నికల్లో గంటా తెలుగుదేశం పార్టీని వదిలి మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరి, అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. అనకాపల్లిలో సైతం ఆయన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్నా ఆయన విజయం సాధించడం విశేషం.
అనంతరం ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇందులో భాగంగా గంటకు మంత్రి పదవి దక్కింది. కాగా, 2014 లో గంట తిరిగి టీడీపీలో జాయిన్ అయ్యి భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఈ 2019 ఎన్నికల్లో గంట తెలుగుదేశం పార్టీలోనే ఉండి విశాఖ నార్త్ స్థానం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలైనా… గంట విజయం మాత్రం ఆగలేదు.








