25.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఐదేళ్లు గాడిదలు కాశారా?: చంద్రబాబుపై విరుచుకుపడిన వైఎస్ షర్మిల!

ఐదేళ్లు గాడిదలు కాశారా?: చంద్రబాబుపై విరుచుకుపడిన వైఎస్ షర్మిల!

YS Sharmila Latest News, AP Political News, YCP Latest News, Chandrababu Naidu News, Newsxpressonline
- Advertisement -
హైదరాబాద్: ఏపీలో ఎన్నికల సమయాన విమర్శల హోరు పెరిగిపోతోంది. తాజాగా ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని వ్యాఖ్యానించారు. 
 

సోమవారం షర్మిల విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు పాలనలో భూతద్దం పెట్టుకుని వెతికినా అభివృద్ధి జాడే కనిపించడం లేదని విమర్శించారు. వైఎస్సార్‌ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, అలాగే పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదువుకునేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

నేనొక సామాన్యురాలిగా మాట్లాడుతున్నా…

‘‘నేను వైఎస్సార్‌ కూతురుగా కాకుండా సామాన్యురాలిగా మాట్లాడుతున్నా.. భూత‌ద్దం పెట్టుకుని వెతికినా రాష్ట్రంలో ఎక్క‌డా అభివృద్ధి క‌నిపించ‌డం లేదు. మ‌హానేత వైఎస్సాఆర్ హ‌యాంలో పేద కుటుంబం సంతోషంగా ఉండేది. రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది. పంట‌కు గిట్టుబాటు ధ‌ర ఉండేది. ప్ర‌తి వ్య‌క్తికి ఉపాధి ఉండేది…’’ అని షర్మిల తెలిపారు.

పేద‌ విద్యార్థి ఉచితంగా గొప్ప చదువులు చదివేలా పూర్తి రీయింబ‌ర్స్‌మెంట్ ప్రభుత్వం ఇచ్చేదని గుర్తు చేశారు. రూ.14 వేల కోట్లు ఉన్న పోల‌వ‌రం ప్రాజెక్టు వ్య‌యాన్నిరూ.60 వేల కోట్ల‌కు పెంచారు. నామినేష‌న్ ప‌ద్ధ‌తిలో బాబుకు కావాల్సిన వాళ్ల‌కు కాంట్రాక్టులు ఇచ్చుకున్నారు. కేంద్రం నుంచి పోల‌వ‌రాన్ని లాగేసుకుంది ఈ పని చేయడానికి కదా? అని ప్రశ్నించారు. 
 
పోల‌వ‌రాన్ని 3 ఏళ్ల‌లో పూర్తి చేస్తామ‌ని మీరు చెప్ప‌లేదా.. చంద్ర‌బాబు, నేటికి అది పూర్తి కాలేదంటే అది మీ అస‌మ‌ర్థ‌త కాదా? అంటూ మండిపడ్డారు.

అమరావతి అంటూ గ్రాఫిక్స్…

‘‘అమరావతి అంటూ గ్రాఫిక్స్ చూపారు. ఈ ఐదేళ్లు గడిదలు కాశారా? కనీసం ఒక్క శాశ్వత భవనం కట్టారా? డేటా చోరీ దోషులని ఇప్పటికీ పట్టుకోలేదు, సిగ్గుగాలేదా? బాబు, మోడీ ఇద్దరూ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేసింది వాస్తవం కాదా? ప్రత్యేక హోదాను నీరుగార్చిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోరా?’’ అంటూ ఆమె చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ యాక్టింగ్…

‘‘పవన్ కళ్యాణ్ యాక్టర్, యాక్టర్ డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. ప్రస్తుతం ఆయన అదే చేస్తున్నాడు. చంద్రబాబు డైరెక్టర్‌ కాబట్టే …. డైరెక్టర్ చెప్పినట్టు పవన్ చేస్తున్నాడు. పవన్ నామినేషన్‌కి పచ్చ పార్టీ క్యాడర్ ఉంటుంది. పైకి మాత్రం పొత్తులు లేవని చెబుతూ.. లోపల కుమ్మక్కు రాజకీయాలు చేస్తుంటారు. పవన్‌కు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్టే. జనసేన పార్టీకి ఓటు వేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినట్లే..’’ అని షర్మిల వ్యాఖ్యానించారు. 
 
‘‘మా చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను కూడా రాజకీయం చేస్తున్నారు. కుటుంబ పెద్దను ఎవరైనా చంపుకుంటారా?.. మీ ఫ్యామిలీలో గొడవలు ఉంటే హత్యలు చేసుకుంటున్నారా? మేం బాధితులం, అయినా మాపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా కుటుంబ సభ్యుల హత్యలు జరిగాయి. చంద్రబాబుకు దమ్ముంటే థర్డ్ పార్టీ విచారణకి సిద్ధపడాలి..’’ అని వైఎస్‌ షర్మిల సవాల్‌ విసిరారు. 
 
- Advertisement -