
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. ఇటు టీడీపీ, అటు కాంగ్రెస్ పార్టీల నుంచి నేతలు వరుస కడుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతల అధికార పార్టీనుంచి చేరగా.. మరికొంతమంది చేరికలు కొనసాగుతున్నాయి.
తాజాగా, తాజాగా విశాఖపట్నం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లో తనను కలిసిన దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్‌ను పార్టీ కండువాలతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో టీడీపీ నిమజ్జనమే..
వైసీపీలో చేరిన అనంతరం దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ పార్టీలో కలిసే అవకాశం ఉందని అన్నారు. మంచి పాలన అందిస్తారన్న నమ్మకంతో గత ఎన్నికల్లో టీడీపీని గెలిపించారని, కానీ ఆ ఆశలన్నీ వమ్ము అయ్యారని మండిపడ్డారు.
చంద్రబాబు పరిపాలనను గాలికి వదిలేశారని, రాజకీయమే పరమావధిగా పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అవినీతి విలయతాండవం చేస్తోందని విమర్శించారు. సామాన్య ప్రజలు డబ్బు చెల్లించకుండా ప్రభుత్వంతో పనులు చేయించుకునే పరిస్థితులు లేవన్నారు. రెండు నెలల్లో ఎన్నికలు ఉంటాయనగా ప్రజలకు పప్పుబెల్లాలు పంచుతున్నారని ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ ఆశయాలను పూర్తిగా చంద్రబాబు గాలికి వదిలేసి టీడీపీ ఉనికి కోల్పోయిందన్నారు. టీడీపీని ‘తెలుగు కాంగ్రెస్’గా మార్చి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా తయారు చేశారని దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీలో టీడీపీని నిమజ్జనం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. సిద్ధాంతాలు, విధానాలను తుంగలో తొక్కి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నదే చంద్రబాబు తాపత్రయమని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మక అవసరమని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం బాగుపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల సమస్యలను వైఎస్ జగన్ ప్రత్యక్షంగా తెలుసుకున్నారని, ఆయనలా సుదీర్ఘ పాదయాత్ర చేసిన వారు ఎవరూ లేరని అన్నారు. రాజకీయ నాయకుడిగా ఆయన ఎంతో పరిపూర్ణత సాధించారని ప్రశంసించారు.
ఇది ఇలాఉండగా, విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సతీశ్ వర్మ కూడా వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేవరపల్లి ఎంపీపీ, ఇతర నాయకులు కూడా వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.








