శ్రీకాకుళం: ‘టిట్లీ’ తుపాను దెబ్బకు శ్రీకాకుళం జిల్లావాసులు అల్లాడుతున్నారు. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం తాకిడికి పంట పొలాలన్నీ ధ్వంసం కాగా, నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు ఇక్కడి ఉద్దానంలో కిడ్నీ వ్యాధి బాధితులు తాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
చదవండి: వణికిస్తోన్న‘టిట్లీ’ తుపాను, రెండు జిల్లాల్లో 8 మంది మృతి, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, తీరం దాటినా…
జిల్లాలోని సామాన్యులకు మంచినీరు, నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకుండా పోయాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై ఇంకా నీళ్లు ప్రవహిస్తూ ఉండడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కేంద్రంతోపాటు రాష్ట్రానికి చెందిన 20 విపత్తు నిర్వహణ బృందాలు శ్రీకాకుళంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
సీఎం స్వీయ పర్యవేక్షణ…
మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుపాను సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో సాధారణ పరిస్థితి నెలకొనే వరకూ తాను శ్రీకాకుళంలోనే ఉంటానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. రోడ్లను వెంటనే క్లియర్ చేయాలనీ, విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్థరించాలని చంద్రబాబు అధికారులను అదేశించారు.
చదవండి: ‘టిట్లీ’ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే, అండగా ఉంటామని భరోసా..
తాజాగా సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి ఓ ఐఏఎస్ అధికారిని కూడా చంద్రబాబు నియమించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు దాదాపు 100 మంది డిప్యూటీ కలెక్టర్లను చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు రప్పించారు.
‘టిట్లీ’ తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో 12000 విద్యుత్ స్తంభాలు కూలిపోగా.. అధికారులు ఇప్పటి వరకూ 4000 స్తంభాలను పునరుద్థరించారు. మరోవైపు తుపాను తాకిడికి నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం, పేదలకు 25 కేజీల బియ్యంతో పాటు కిలో చక్కెర, కిలో కందిపప్పు, లీటరు వంటనూనె, కిలో అలూ అందించాలని కూడా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్‌ను అదుకోండి: మోడీకి బాబు లేఖ…
ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో తీరం దాటిన ‘టీట్లీ’ తుపాను శ్రీకాకుళం జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీని తీవ్రతకు దాదాపు 3 లక్షల ఎకరాల్లో పంటలు నాశనం కాగా… పలు రోడ్లు, భవనాలు పూర్తిగా పాడైపోయాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి శనివారం లేఖ రాశారు.
రూ. 1,200 కోట్లు విడుదల చేయండి…
‘టీట్లీ’ భీభత్సం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో రూ.2800 కోట్ల నష్టం వాటిల్లిందని చంద్రబాబు అందులో తెలిపారు. తుపాను దెబ్బకు శ్రీకాకుళంలో మౌలిక వసతులు ఛిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, ప్రభుత్వ భవనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని వెల్లడించారు. జిల్లాలో 12,000 విద్యుత్ స్తంబాలు నేలకూలాయని, రాష్ట్రానికి తక్షణ సాయంగా కేంద్రం రూ. 1,200 కోట్లు విడుదల చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
పెద్ద మనసుతో ఆదుకోండి…
తుపాను ప్రభావంతో జిల్లాలోని వ్యవసాయ రంగానికి 800 కోట్ల రూపాయలు, ఉద్యానవన శాఖకు 1,000 కోట్లు రూపాయలు, విద్యుత్ రంగానికి 500 కోట్ల రూపాయలు, పంచాయితీరాజ్ శాఖకు మరో 100 కోట్ల రూపాయలు, పశుసంవర్ధక శాఖకు 50 కోట్లు ఇరిగేషన్ శాఖకు మరో 100 కోట్ల నష్టం సంభవించిందని సీఎం చంద్రబాబు ప్రధాని మోడీకి రాసిన లేఖలో వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాను పెద్ద మనసుతో కేంద్రం అదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.