
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఓ పట్టాన అంతుబట్టవు. కారణం పార్టీలు, నేతలు వేసే సరికొత్త ఎత్తుగడలే. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్న విషయంలో ఏ పార్టీకి, ఆ పార్టీ తమదే గెలుపు అని చెప్పుకుంటున్నాయి. సర్వేలు కూడా టీడీపీ, వైసీపీ రెండు పార్టీలకూ అనుకూలంగా వస్తున్నాయి.
కొన్ని టీడీపీ గెలుస్తుందంటే, కొన్ని వైసీపీదే క్లియర్ మెజారిటీ అంటున్నాయి. ఏ సర్వేని నమ్మాలో తెలియని అయోమయం క్రియేట్ అవుతోంది. సరే కాసేపు వాటి సంగతి పక్కన పెడదాం. టీడీపీ అధినేత చంద్రబాబు తాము అధికారంలోకి వస్తామని 100 శాతం నమ్మకంతో ఉన్నట్లు తెలిసింది. అదే జరిగితే ప్లాన్ A అమలు చేస్తారని సమాచారం.
ప్లాన్ A : ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రయత్నించడం. ఇందుకోసం మరిన్ని కంపెనీలను ఏపీకి తెప్పించేందుకు కేంద్రం స్థాయిలో సంప్రదింపులు జరపడం. ప్రతిపక్ష నేత జగన్‌పై ఉన్న కేసులు త్వరగా సెటిలయ్యేలా చేసి… ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలనే ఆలోచన.
ప్లాన్ A అనేది టీడీపీకి ఎంతో ఇష్టమైనది. ఎట్టిపరిస్థితుల్లో అదే అమలవ్వాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఒకవేళ ప్లాన్ A అమలవ్వకపోతే, ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో… ఇప్పటికే ప్లాన్ B కూడా ఆయన అమలుచేస్తున్నారనీ, ఆ విషయం జగన్ ఇంకా గ్రహించలేదనే ప్రచారం జరుగుతోంది.
ప్లాన్ B : ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం. వాటిని చూసి ప్రతిపక్ష వైసీపీ… వాటికంటే ఇంకా పెద్ద హామీలు ఇవ్వాలనే ఆలోచనకు వచ్చేలా చేసి, అలాంటి హామీలు ఇచ్చేలా ప్రేరేపించి, తీరా వైసీపీ అధికారంలోకి వస్తే, ఆ హామీలు నెరవేర్చలేకపోతే, ఆ పార్టీపై విమర్శలతో విరుచుకుపడటం.
ఇందుకు జగన్ చెప్పే మాటల్ని టీడీపీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ పాదయాత్రతోపాటూ… మేనిఫెస్టో రిలీజ్ నాడు కూడా అన్ని హామీలనూ నెరవేర్చిన తర్వాతే తిరిగి 2024లో ఎన్నికలకు వస్తామని అంటున్నారు.
ఏ పార్టీకైనా ఎన్నికల మేనిఫెస్టోనూ వంద శాతం అమలు చెయ్యడం దాదాపు అసాధ్యం. అందులోనూ నిధులు లేని ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇప్పుడైతే అది చాలా కష్టం. అందుకే టీడీపీ ఈ ఎన్నికల్లో ఓడిపోతే, జగన్‌పై హామీల ఒత్తిడి తెచ్చి ఇరకాటంలో పెట్టే ప్లాన్ Bని అమలు చేసే యోచనలో ఉందన్న ప్రచారం జరుగుతోంది.








