
అమరావతి: ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాట నిలబెట్టుకోవడం చేతకాక ఏపీకి నమ్మక ద్రోహం చేసిన మోడీ.. ఆర్థిక నేరస్థులతో కలిసి కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు.
లక్ష కోట్లు దోచుకున్నవారితో దోస్తీ…
విభజన గాయాలతో కుదేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెంకన్న సాక్షిగా మోడీ మాటిచ్చారని మరోసారి గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని, లక్ష కోట్లు దోచుకున్న స్కామాంధ్ర ఆర్థిక నేరస్థులను కటకటాల వెనుక ఉంచుతానన్న మోడీ.. ఇప్పుడు వారితోనే జట్టుకట్టారని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
చంద్రబాబుతో రాష్ట్రం బంగారు భవిష్యత్ వైపు అడుగులు వేస్తుందని మోడీనే చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్ఠు పట్టించడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఒక్క విభజన హామీ కూడా అమలు చేయకుండా.. వైసీపీకి సాయం చేయడానికి నిస్సిగ్గుగా మోడీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారని విమర్శించారు.
ఏపీ ప్రజలు మేల్కోవాలని, ధర్మపోరాటంతో రాష్ట్ర ద్రోహులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న విషయం తెలిసిందే.








