వెన్నుపోటులో చంద్రబాబే సీనియర్!: ఏపీ సీంను ఏకిపారేసిన మోడీ, ‘తండ్రీకొడుకులు దిగిపోవాల్సిందే’…

modi-cbn

modi-guntur

గుంటూరు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మూడు కీలక ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు గుంటూరు వచ్చిన ప్రధాని మోడీ.. ప్రజాచైతన్య సభలో ప్రసంగించారు.

తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోడీ…

‘అక్షర క్రమంలోనే కాకుండా అన్ని రంగాల్లో.. అంశాల్లో అగ్రగాములైన ఆంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు. పద్మభూషణ్‌, దళిత రత్నం, కవి కోకిల గుర్రం జాషువా జన్మించిన గుంటూరు జిల్లా ప్రజలకు నమస్కారం. మహా కవి తిక్కన జన్మించిన గుంటూరు ప్రజలకు శుభాకాంక్షలు..’ అని అన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య, నాయుడమ్మ సహా ఈ గడ్డపై జన్మించిన హేమాహేమీలకు నమస్కరిస్తున్నట్లు మోడీ తెలిపారు.

అమరావతి కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశానికి మార్గదర్శిగా, దిక్సూచిగా మారబోతోందని జోస్యం చెప్పారు. అమరావతికి ఎంతో గొప్ప చరిత్ర ఉందనీ, ఇక్కడి పురాతత్వ కట్టడాలను పరిరక్షించడానికి హృదయ్ పథకంలో చేర్చామన్నారు. అనంతరం ఆయన తన ప్రసంగాన్ని హిందీలో కొనసాగించారు. ఆయన ప్రసంగాన్ని ఎంపీ జీవీఎల్ అనువదించారు.

నవభారతం, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కు గుంటూరు కేంద్రం కానుందని ప్రధాని నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. దేశానికే ఏపీ ఆదర్శంగా నిలవబోతోందని వ్యాఖ్యానించారు. అందుకే వేలాది కోట్ల విలువైన పెట్రోలియం మౌలిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామన్నారు. దీనివల్ల ఇంధన రంగంలో దేశానికి భద్రత లభిస్తుందని పేర్కొన్నారు.

విపత్కర పరిస్థితుల్లో, యుద్ధ సమయాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా దేశమంతటా వ్యూహాత్మక ఆయిల్ రిజర్వులను ఏర్పాటు చేస్తున్నామని మోడీ అన్నారు.  ఇలాంటి ఆయిల్ రిజర్వును విశాఖపట్నంలో ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తులను మరింత వాడుకలోకి తీసుకొచ్చేందుకు మరో రెండు ప్రాజెక్టులను ప్రారంభించామని మోడీ తెలిపారు.

వీటివల్ల స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు వ్యాపారాలు పెరుగుతాయన్నారు. కాలుష్య రహిత, చవకయిన ఎల్పీజీ, సీఎన్జీని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని అన్నారు.  నిన్న అస్సాంలో ఈశాన్య గ్యాస్ గ్రిడ్ ను ప్రారంభించామనీ, ఇప్పటికే పలు నగరాలను గ్యాస్ గ్రిడ్లతో అనుసంధానం చేస్తున్నామని చెప్పారు.

నవభారతాన్ని కాలుష్య రహిత భారతాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని మోడీ తెలిపారు. త్వరలోనే ప్రజలు ఈ మార్పును గమనిస్తారనీ, భాగస్వాములు అవుతారని వ్యాఖ్యానించారు. దళిత, ఆదివాసీ, పేదలకు ఉజ్వల పథకం కింద 13 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గత 55 ఏళ్లలో కేవలం 12 కోట్ల కనెక్షన్లు మాత్రమే ఇచ్చిందన్నారు.

వాటిలో చంద్రబాబే సీనియర్: మోడీ

చంద్రబాబు సీనియర్ కాబట్టే ఆయన్ను ఎన్నడూ అగౌరవించలేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అయన్ను ప్రతీసారి గౌరవించామని వ్యాఖ్యానించారు. మిత్రపక్షాలను మార్చడంలో, పార్టీల ఫిరాయింపులు చేయడంలో, సొంత మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడంలో, ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నికల్లో ఓడిపోవడంలో మాత్రమే చంద్రబాబు సీనియర్ అని ఎద్దేవా చేశారు.

ఈరోజు ఓ రాజకీయ పార్టీని తిట్టి, రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో కూడా చంద్రబాబు సీనియర్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకే ఆయనతో సీనియార్టీలో తాను పోటీ పడలేనని ఎద్దేవా చేశారు.

ఏ పార్టీ అయితే రాష్ట్రాన్ని మోసం చేసిందో ఆ పార్టీ(కాంగ్రెస్)తోనే జట్టు కట్టారంటూ విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ద్వారా వచ్చే నిధుల కంటే ఎక్కువే ఇచ్చామని, ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. కేంద్ర పథకం హృదయ్‌ కింద అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని, వేల కోట్ల రూపాయల విలువైన పథకాలు, ప్రాజెక్టులు ప్రారంభించామని ప్రధాని మోడీ వెల్లడించారు.

లోకేష్ కోసమే బాబు పాట్లు.. మహా కల్తీ కూటమి అబద్ధాల ప్రచారం

దేశంలోని ఆడ బిడ్డలను ఇన్నాళ్లూ పొగలో మగ్గేలా చేసిన రాజకీయ నేతలు ఇప్పుడు మహాకూటమి పేరుతో అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు ఈ కూటమితో కలిసి తనను తిట్టిపోసే పోటీలో దిగిపోయారని వ్యాఖ్యానించారు. విపక్షాలది మహాకూటమి కాదనీ, మహా కల్తీ కూటమి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి నవనిర్మాణ హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కుప్పకూలిపోయిన టీడీపీని పునర్ నిర్మించుకునే పనిలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.ఏపీని సన్ రైజ్ రాష్ట్రంగా చేస్తానన్న చంద్రబాబు.. ఇప్పుడు కుమారుడు (సన్) లోకేశ్ ను రైజ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారని సెటైర్ వేశారు.

కేంద్ర పథకాలకు తన స్టిక్కర్లు వేసి ఏపీ సీఎం చంద్రబాబు కలరింగ్ ఇస్తున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమం విషయంలో మాటమారిస్తే ఈ కాపలాదారు ఊరుకోడని స్పష్టం చేశారు.

చంద్రబాబును నిలదీయండి..

ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ ను ఎన్టీఆర్ దుష్టులు అనేవారని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తుచేశారు. అలాంటి పార్టీతోనే ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. ఈ పొత్తును చూసి ఎన్టీఆర్ ఆత్మ ఎక్కడున్నా క్షోభిస్తూ ఉంటుందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉండి ఎన్నికలలో గెలిచే సత్తా చంద్రబాబుకు లేదని మోడీ విమర్శించారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని చంద్రబాబుకు భయం పట్టుకుందని అన్నారు. తాను ధనికుడిని ఎలా అయ్యానో ప్రజలకు తెలుస్తుందన్న భయంతో బాబుకు నిద్ర పట్టడం లేదనీ, వణుకుతున్నారని వ్యాఖ్యానించారు.

మోడీ ప్రభుత్వం ఇచ్చిన ప్రజల సొమ్ముకు లెక్కలు అడగడంతో చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఢిల్లీలోని నేతలు ఎవరూ ఇలాంటి లెక్కలు అడగలేదన్నారు.

‘‘ఆంధ్రా ప్రజలారా.. మేల్కొనండి. రేపు చంద్రబాబు ఫొటోలు దిగడానికి ఢిల్లీకి వెళుతున్నారు. వెంట భారీ మందీ మార్బలంతో ఢిల్లీకి వస్తున్నారు. బీజేపీ సొంత నిధులతో గుంటూరు సభ పెడితే, టీడీపీ నేతలు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకుని ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు..’’  అని విమర్శించారు. ఈ విషయమై ఏపీ ప్రజలు చంద్రబాబును నిలదీయాలని పిలుపునిచ్చారు.

దమ్ముంటే ఢిల్లీకి రాకముందు, తనను తిట్టేముందు ఏపీ ప్రజలకు ఖర్చుపై లెక్కలు చెప్పి రావాలని చంద్రబాబుకు మోడీ సవాల్ విసిరారు.

బాబు అవినీతి ప్రభుత్వం పోవాల్సిన టైం వచ్చింది..

ఏపీ సీఎం చంద్రబాబు తప్పుడు మాటలను కాదని రాష్ట్ర ప్రజలు భారీ సంఖ్యలో గుంటూరు సభకు వచ్చారని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఏపీలో తండ్రీకొడుకుల (చంద్రబాబు-లోకేష్) అవినీతి ప్రభుత్వం పోవాల్సిన సమయం ఆసన్నమయిందని వ్యాఖ్యానించారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని మోడీ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు.

సాధారణంగా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు దిష్టి తగలకుండా పెద్దలు నల్ల చుక్క పెడతారని ప్రధాని అన్నారు. గుంటూరులో జరుగుతున్న బీజేపీ సభకు దిష్టి తగలకుండా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, టీడీపీ నేతలు నల్ల బెలూన్లను ఎగురవేశారనీ, ఇందుకోసం ధన్యవాదాలని మోడీ అన్నారు. అనంతరం జై ఆంధ్రా, భారత్ మాతాకీ జై అని నినాదాలతో ప్రసంగాన్ని ముగించారు.