ఢిల్లీలో ప్రారంభమైన టీడీపీ ‘ధర్మపోరాట దీక్ష’! బాబు ఉద్వేగభరిత ప్రసంగం!

10:35 am, Mon, 11 February 19
11
chandrababu dharma porat diksha

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా, తెలుగుదేశం పార్టీ ధర్మ పోరాట దీక్ష కొద్దిసేపటి క్రితం మొదలైంది. దీక్షను ప్రారంభిస్తూ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు.

అందరికీ శుభాభినందనలు. ఈరోజు మనందరమూ కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం. ఎప్పుడైతే పాలకులు, పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు, అదే విధంగా ఒక రాష్ట్రం పట్ల, ఒక ప్రాంతం పట్ల వివక్ష చూపించినప్పుడు, అన్యాయం చేసినప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఆ న్యాయ పోరాటం కోసమే మనమందరం ఇక్కడకు వచ్చాం.

ఈరోజు చలిని కూడా లెక్కబెట్టకుండా మహాత్మాగాంధీ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించి, అంబేద్కర్ కు నివాళులు అర్పించి, ఎన్టీఆర్ ఆత్మ సాక్షిగా మనందరం ఇక్కడ సమావేశమయ్యే పరిస్థితికి వచ్చాం. ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది అని చంద్రబాబు అన్నారు.

ఏపీ భవన్‌లో కోలాహలం…

పార్లమెంట్ లో విభజన చట్టం పెట్టి, హామీలెన్నో ఇచ్చి రాష్ట్రాన్ని విభజించారని, హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడంతో, నాడు ప్రత్యేక హోదాకు హామీ ఇచ్చారని వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఆ హామీల అమలుకు నిరంతరం పోరాడుతున్నామని వ్యాఖ్యానించారు. తాను న్యూఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష తలపెడితే, అందుకు ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారని, ఆ అవసరం ఇప్పుడేమొచ్చిందని ప్రశ్నించారు.

రాష్ట్రానికి ఇచ్చిన నిధులను కూడా వెనక్కు తీసుకున్న ఘనత కేంద్రానిదని నిప్పులు చెరిగిన ఆయన, విశాఖకు రైల్వే జోన్ ఇస్తామన్న హామీని నెరవేర్చలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతామన్న హామీని నెరవేర్చలేదని, ఇలా ఎన్నో అంశాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తు చేసి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే హస్తినకు వచ్చామని అన్నారు.

చదవండి: వెన్నుపోటులో చంద్రబాబే సీనియర్!: ఏపీ సీంను ఏకిపారేసిన మోడీ, ‘తండ్రీకొడుకులు దిగిపోవాల్సిందే’…