
అమరావతి: ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకి ఎన్నికలు ముగిసి 20 రోజులైంది. మరో 23 రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈలోపే చాలా సర్వేలు బయటకొస్తున్నాయి. వీటిల్లో కొన్ని సర్వేలు వైసీపీ ఘనవిజయం సాధిస్తాయని చెబుతుండగా.. మరికొన్ని సర్వేలు టీడీపీ తిరిగి అధికారాన్ని సొంతం చేసుకుంటుందని చెబుతున్నాయి.
చదవండి: ఈ ఎన్నికలలో జగన్ ఓడిపోతే జరిగేది అదేనా…?
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించి…ఏ బూతులో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి…అందులో టీడీపీకి ఎన్ని పడి ఉంటాయి అనే లెక్కలు తెలుసుకొనున్నారు. అలాగే కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేతలకి దిశానిర్దేశం చేయనున్నారు.
ఈసారి అన్ని నియోజకవర్గాలపై…
ఇక రేపటి నుంచి అమరావతిలో రోజుకు 2 పార్లమెంట్ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలపై సమీక్షలు జరగనున్నాయి. ఈ సమీక్షా సమావేశాలకు ఒక్కో అసెంబ్లీ స్థానం నుంచి 50 మంది నాయకులు హాజరవుతారని తెలుస్తోంది.
చదవండి: వర్మ ఒక సైకో! యామిని సంచలన వ్యాఖ్యలు!
కాగా, ఇటీవలే చంద్రబాబు 175 నియోజకవర్గాల టీడీపీ అభ్యర్ధులతో సమావేశం నిర్వహించారు. కానీ అప్పుడు నేతలు సరైన సమాచారం తీసుకురాకపోవడంతో చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం కుప్పం నియోజకవర్గానికి చెందిన సమాచారం మాత్రమే పూర్తిగా వచ్చింది.
దీంతో కుప్పం లాగా మిగతా నియోజకవర్గాలకి సంబంధించి పూర్తి సమాచారం తీసుకురమ్మని… మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే చంద్రబాబునాయుడు గురువారం నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.








