

విజయవాడ: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీలో కూడా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం శాసనసభ్యుడు ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరారు.
సోమవారం విజయవాడలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సతీసమేతంగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరానని చెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కీలకంగా మారబోతోందన్నారు.
పవన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి
పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే పూర్తి విశ్వాసం తనకుందని, అందుకే సతీసమేతంగా పార్టీలో చేరానని తెలిపారు. పదవులు ఆశించి కాకుండా పార్టీ నాయకుడిపై ఉన్న అభిమానం, నమ్మకం కొద్దీ తాను కూడా జనసేనలో చేరినట్లు ఆకుల సత్యనారాయణ సతీమణి లక్ష్మీ పద్మావతి తెలిపారు. అంతకుముందు సత్యనారాయణ తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి రాజమహేంద్రవరం నుంచి ర్యాలీగా విజయవాడకు వచ్చారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆకుల సత్యనారాయణ పార్టీలో చేరడం శుభపరిణామన్నారు. 2014లో పొత్తులో భాగంగా ఆకులకు మద్దతిచ్చామని.. ఆయన చేరికతో జనసేన మరింత బలోపేతం అవుతుందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆకుల కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, జనసేన పార్టీ ఆయనకు అండగా ఉంటారన్నారు.








