విజయవాడ: అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 254 ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు ఇప్పుడు కేవలం 54 ఆస్తులనే బయటపెట్టారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. 2014లో స్వాధీనం సమయంలో రూ.25,000 కోట్లుగా ఉన్న ఆస్తుల విలువ ఇప్పుడు హారతి కర్పూరంలా కరిగిపోయి 2,500 కోట్లకు దిగజారడం వెనుక ఆంతర్యం ఏంటని మంగళవారం ఆయన ప్రశ్నించారు.
అగ్రిగోల్డ్ ఆస్తులను తెలుగుదేశం పచ్చ చొక్కాలే మింగేశాయన్నారు. పలువురు టీడీపీ మంత్రులు, వారి భార్యలు ఆ ఆస్తులను ముచ్చటపడి మరీ ఆక్రమించుకున్నారని వెల్లడించారు. ఇలాంటి ఘటనలపై సీఐడీ విచారణ చేస్తుందా? లేక కాకమ్మ కబుర్లు చెబుతుందా? అని జీవీఎల్ ప్రశ్నించారు.
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై వచ్చిన ఆరోపణలపై సీఐడీ క్లీన్ చిట్ ఇచ్చిందనీ, ఇలాంటి చర్యల ద్వారా అవినీతిపరుల్ని సీఐడీ కాపాడుతోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని ఆయన మండిపడ్డారు. సీఐడీ అన్నది ‘చంద్రన్నఇంట్రెస్ట్ డిపార్ట్‌మెంట్’గా మారిపోయిందంటూ జీవీఎల్ ఎద్దేవా చేశారు.
అంతేకాదు, హాయ్ ల్యాండ్ భూములపై మంత్రి లోకేశ్ కన్నుపడిందనీ, అందుకే ఆస్తుల వేలంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని కూడా ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో బ్యాంకులకు లేఖ రాస్తాననీ, ఆస్తుల వేలాన్ని సక్రమంగా చేపట్టాల్సిందిగా కోరతానని నరసింహారావు చెప్పారు. ప్రజల సొమ్మును కొట్టేసే ఈ కుట్రలో భాగస్వాములైన అందరూ జైలుకు వెళ్లక తప్పదని జీవీఎల్ హెచ్చరించారు.