కర్నూలు: దొంగ ఓట్ల తొలగింపు అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. తమ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రజలు, నాయకుల ఓట్లను తొలగించారంటూ ఓ వైపు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుండగా.. మరో వైపు తమ వైపు కూడా ఓట్ల తొలగింపు జరిగిందంటూ అధికార టీడీపీ వాదిస్తోంది.
ఈ తరుణంలోనే తన ఓటు సైతం తొలగించారంటూ ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా 9 సార్లు పోటీ చేశా. ప్రస్తుతం మంత్రిగా ఉన్నా. నాతో పాటు నా కుటుంబసభ్యుల ఓట్లను సైతం తొలగించారు. చాలామంది మైనార్టీల ఓట్లు గల్లంతయ్యాయి. మంత్రిగా ఉన్న నా ఓటే లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?’’ అని వైద్యవిద్యశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆందోళన వ్యక్తం చేశారు.
కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి ఓట్లు ఉన్నాయని.. నంద్యాలలోనే పుట్టి ఇక్కడే పెరిగిన తమకు, తమ కుటుంబసభ్యులకు ఓట్లు గల్లంతవడం ఏంటని ప్రశ్నించారు.
ఈ విషయాన్ని ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లగా తనకు తెలియదని చెప్పారని ఫరూక్ తెలిపారు. అంతేగాక, వైసీపీ కుట్రలో భాగంగానే తమ ఓట్లను తొలగించారని, దీనిపై ఎన్నికల అధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని సదరు మంత్రి కోరారు. మంత్రి ఓటే తొలగించారంటే.. ఇక తమ పరిస్థితి ఏంటని సామాన్యులు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.








