పిచ్చి పిచ్చిగా వాగితే అంతు చూస్తాం: చంద్రబాబును హెచ్చరించిన కొడాలి నాని

- Advertisement -

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని మరోమారు విరుచుకుపడ్డారు.

ముఖ్యమంత్రి జగన్ గురించి పిచ్చిపిచ్చిగా వాగితే అంతు చూస్తామంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

కంకిపాడు రహదారి నిర్మాణ పనులకు ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి నాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

సోషల్ మీడియాలో జగన్‌పై పిచ్చి వాగుళ్లు వాగితే అంతు చూస్తామని మంత్రి తీవ్ర స్వరంతో హెచ్చరించారు. జగన్ దయతోనే చంద్రబాబు, లోకేశ్ హైదరాబాద్ తిరిగి వెళ్లగలుగుతున్నారని అన్నారు.

చంద్రబాబు తనను ఏమీ చేయలేరని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కో నియోజకవర్గాన్ని వెయ్యి కోట్ల రూపాయల నిధులతో చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.

జగన్ ఇంత చేస్తున్నా ప్రతిపక్షాలకు కనబడకపోవడం విడ్డూరమని అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు మాడు పగిలితే, మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో వాత పెట్టారని కొడాలి ఎద్దేవా చేశారు.

- Advertisement -