
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ చేదు వార్త చెప్పింది. గురువారం రావాల్సిన జీతాలు ఇప్పటి వరకు ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. దీంతో ఏం జరిగిందో తెలియక ఉద్యోగులు ఆర్థిక శాఖను సంప్రదిస్తే అసలు విషయం మెల్లిగా చెప్పింది. వేతనాలు చెల్లించలేకపోయామని ప్రకటన విడుదల చేసింది.
అయితే, ఇందుకు నిధుల కొరత మాత్రం కారణం కాదని తెలిపింది. దీంతో నాలుగు లక్షల మంది ఉద్యోగులు వేతనం ఎప్పుడొస్తుందా? అని ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు. సాధారణంగా ప్రతి నెల 1న భారతీయ రిజర్వు బ్యాంకు ఈ-కుబేర్ ద్వారా చెల్లింపులు జరుగుతాయని, అన్ని జిల్లాల పింఛన్లు, జీతాల ఫైళ్లు జూలై 31నే రిజర్వు బ్యాంకుకు పంపామని ఆర్థిక శాఖ తెలిపింది.
ఒకటో తేదీ మధ్యాహ్నం నాటికి పింఛన్లు పూర్తిగా చెల్లించడంతోపాటు కొందరు ఉద్యోగుల వేతనాలు కూడా చెల్లించినట్టు తెలిపింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ- ముద్ర ద్వారా పొందిన సర్టిఫికెట్లు పని చేయకపోవడంతో మిగిలిన ఫైళ్ల చెల్లింపు ఆలస్యమైనట్టు పేర్కొంది. వెంటనే సమస్యను పరిష్కరించి మిగిలిన వేతనాలు చెల్లిస్తామని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.








