
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పర్యటన ముగిసింది. అమెరికా నుంచి తిరుగు ప్రయాణమైన జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం తెల్లవారుజామును హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ఆ తరువాత అక్కడి నుంచి నేరుగా విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జగన్.. అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 15న తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి ఓ యూనివర్శిటీలో ఆయన తన కుమార్తెను చేర్పించారు. దీంతోపాటు, పలు అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.
భారత రాయబారి హర్షవర్దన్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీలో వ్యాపార, వాణిజ్యవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. డల్లాస్‌లో తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా నిర్వహించిన కార్యక్రమంలో కూడా జగన్ పాల్గొన్నారు.








