

న్యూఢిల్లీ: ఉత్తమ రాష్ట్రం విభాగంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం లభించింది. సోమవారం జాతీయ జల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అవార్డులను అందజేశారు. ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, సంస్థలు, మీడియా సంస్థలను అవార్డులకు ఎంపిక చేశారు.
నదీ పునరుజ్జీవం విభాగంలో కర్నూలు జిల్లాకు తొలిస్థానం లభించింది. ఆంధ్రప్రదేశ్ తరఫున మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు ఇతర అధికారులు అవార్డులు అందుకున్నారు.
జిల్లాలవారీగా అవార్డులు..
భూగర్భ జలాల పెంపుదలలో అనంతపురం జిల్లాకు ప్రథమ బహుమతి లభించగా.. ప్రోత్సాహక జిల్లాల విభాగంలో కడప జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. భూగర్భజలాల పెంపుదలలో ప్రోత్సాహక జిల్లాల విభాగంలో విశాఖకు రెండో స్థానం దక్కింది.
ఇక భూగర్భజలాల పెంపుదలలో తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు ద్వితీయ బహుమతి లభించింది. నీటి వినియోగంలో కాకతీయ వర్సిటీ జియాలజీ విభాగం తొలిస్థానంలో నిలిచింది. కాగా, నీటి నిర్వహణ, యాజమాన్య విధానంలో ఉత్తమ టీవీ ప్రదర్శనల విభాగంలో ఈటీవీ తెలంగాణకు ద్వితీయ బహుమతి లభించింది.
చదవండి: 2019 ఎన్నికల తర్వాత పెనుమార్పులు, పోటీపై త్వరలోనే: జేపీ ఆసక్తికర వ్యాఖ్యలు








