29.5 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మేం చచ్చిపోతాం.. అనుమతివ్వండి: రాష్ట్రపతికి లేఖ రాసిన అమరావతి రైతులు

మేం చచ్చిపోతాం.. అనుమతివ్వండి: రాష్ట్రపతికి లేఖ రాసిన అమరావతి రైతులు

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. కారుణ్య మరణానికి తమకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. రాజధాని విషయంలో తాము దారుణంగా మోసపోయామని, మూకుమ్మడిగా చనిపోయే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో తామంతా రోడ్డున పడ్డామని వాపోయారు. అప్పట్లో అమరావతిని రాజధానిగా అంగీకరించిన జగన్.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి స్వలాభం కోసం రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 14 రోజులుగా కుటుంబాలతో కలిసి ఆందోళనలు చేస్తున్నా తమ బాధలను వినిపించుకోవడం లేదన్నారు.

అధికార పార్టీ నేతలు తమ త్యాగాన్ని హేళన చేస్తున్నారని రైతులు తమ లేఖలో పేర్కొన్నారు. తమకు కులం, మతం, ప్రాంతం అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన తమను పెయిడ్‌ ఆర్టిస్టులని మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే తమపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.

అధికారం అడ్డు పెట్టుకుని అర్ధరాత్రి తమ ఇళ్లపైకి పోలీసులను పంపి అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. తమ పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమైందని ఆందోళన వ్యక్తం చేశారు. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే తమపై కక్ష కట్టిందని ఆరోపించారు. ఈ బతుకులు తమకొద్దని, తమకు మరణమే శరణ్యమని అన్నారు. కాబట్టి తమకు కారుణ్య మరణానికి అవకాశం కల్పించాలని రైతులు తమ లేఖలో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -