ఏపీలో అలజడి సృష్టిస్తోన్న కొత్త సర్వే..!

7:51 am, Mon, 15 April 19
ap new sarvey

అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ నడుమ, అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు, కాసింత హింసతో.. మొత్తానికి ముగిసిపోయాయి. అయితే ఈ ఎన్నిక ఫలితాల కోసం మరో 40 రోజులు ( మే 23న ఫలితాలు ) వేచి చూడక తప్పని పరిస్థితి.

అయితే ఈలోపే రాజకీయ పార్టీల బులపాటం ఆగడం లేదు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ పైచేయి సాధిస్తోంది.. అనే విషయాలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. కొంతమంది మరో అడుగు ముందుకేసి అసలు ఎవరు ఏ పార్టీకి ఓటేశారో కనుక్కుంటే పోలా? అనుకున్నారో ఏమోగానీ ఆ ప్రయత్నాలూ చేస్తున్నారు. 

ఐవీఆర్ఎస్ విధానంలో ఓటర్లకు ఫోన్లు చేసి వారు ఎవరికి ఓటేశారో కనుక్కునే ప్రయత్నం ప్రస్తుతం ఏపీలో జరుగుతోంది. 8667124557 నంబర్ నుంచి ఫోన్ చేసి చేస్తున్న ఈ సర్వేలో… టీడీపీకి ఓటు వేసి ఉంటే 1 – వైసీపీకి ఓటేస్తే 2 – జనసేనకు ఓటేస్తే 3 – కాంగ్రెస్‌కు ఓటేస్తే 4 – ఇతరులకు ఓటేస్తే 5 నొక్కాలి అని అడుగుతున్నారు.

పోలింగ్‌కు ముందు కూడా ఇలాంటి సర్వే…

ఇది ఎవరో అనధికారికంగా చేయిస్తున్న సర్వే అని అర్థమవుతోంది. అయతే దీనివెనుక టీడీపీ ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలింగ్‌కు ముందు చంద్రబాబు ఇప్పటికే నాలుగైదుసార్లు ఇలాంటి ఐవీఆర్ సర్వేలు చేయించారు.

ప్రభుత్వ పనితీరుపై పథకాల అమలుపై ప్రజలకు పథకాలు చేరుతున్నాయా? లేదా? అనే అంశంపై.. అలాగే ప్రభుత్వం సంతృప్తిగా పనిచేస్తుందా? లేదా? అనే అంశాలపై సీఎం చంద్రబాబు వాయిస్‌తో ఆ సర్వేలు నిర్వహించారు.

‘‘నేను మీ ముఖ్యమంత్రి చంద్రబాబును మాట్లాడుతున్నాను. ప్రభుత్వ పనితీరుపై మీకు సంతృప్తిగా ఉంటే 1 నొక్కండి… సంతృప్తిగా లేకపోతే 2 నొక్కండి..’’ అని ఆ సందేశం వచ్చేది. అయితే ప్రస్తుతం జరుగుతున్న సర్వేకూ ప్రభుత్వానికీ ఎలాంటి సంబంధమూ లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ సర్వేలో నియోజకవర్గం పేరు అడగడం లేదు. అయినప్పటికీ మొబైల్ నంబర్ ఆధారంగా ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఏ నియోజకవర్గ ఓటరో తెలుసుకోవడం పెద్ద సమస్యేమీ కాదు. దాంతో ఈ సర్వేలో ఎవరికి ఓటేశామో చెబితే ఆ నియోజకవర్గం ఫలితం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది.

చదవండి: ధైర్యం ఉంటే ఫలితాలను అంగీకరించాలి! బాబుకు పురందేశ్వరి చురకలు…