అక్కడ అదృశ్యం అయ్యారంటే.. శవాలైపోయినట్లే! అసలు వెరాక్రజ్‌లో ఏం జరుగుతోంది?

mexico-mass-grave-veracruz
- Advertisement -

వెరాక్రజ్: మెక్సికోలోని కొన్ని ప్రాంతాల్లో మనుషులు ఉన్నట్లుండి అదృశ్యమైపోతుంటారు. ఆడ, మగ, పిల్లా పాప.. తేడా లేదు. ఇలా కనిపించకుండా పోయిన వాళ్లంతా అసలేమవుతున్నారో అంతుబట్టడం లేదు. తమ కుటుంబ సభ్యులు కనిపించడం లేదని, వెతికి పెట్టాలని పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాధితులే రంగంలోకి దిగారు.

కట్ చేస్తే.. అది మెక్సికో‌లోని వెరాక్రజ్ ప్రాంతం. అక్కడి ఓ గుంటలో కొన్ని మృతదేహాలు కనిపించాయనే వార్త గుప్పుమంది. దీంతో పలువురు అక్కడికి చేరుకుని తవ్వడం మొదలుపెట్టారు. దాదాపు 12 మంది మృతదేహాలు దొరికాయి. ఇంకా అక్కడ మరికొన్ని శవాలు ఉన్నట్లు గుర్తించారు.

డ్రగ్స్ దందా.. గ్యాంగ్ వార్స్…

మెక్సికోలో డ్రగ్స్ మాఫియా విస్తరించిపోయింది. దీంతోపాటు మానవ అక్రమ రవాణా కూడా జోరుగా సాగుతోంది. డ్రగ్స్ మాఫియాను నియంత్రించడంలో అక్కడి అధికారులు, ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దీంతో గ్యాంగ్ వార్స్ సర్వసాధారణంగా మారాయి. ఈ నేపథ్యంలో వ్యక్తులు అదృశ్యమవడం, కొన్ని రోజులకు ఎక్కడో ఒకచోట వారి మృతదేహాలు లభించడం జరుగుతోంది.

‘మా అబ్బాయి కనిపించడం లేదండీ.. ఇప్పటికి వారం రోజులైందండీ.. ఏమైపోయాడోనని భయంగా ఉంది..’, ‘స్నేహితురాలి ఇంటికెళ్లిన మా అమ్మాయి ఇంటికి వస్తున్నానని రాత్రి ఫోన్ చేసింది. తెల్లారిపోయిందిగానీ తను ఇంటికి రాలేదు.. కాస్త వెతికి పెట్టరా?’ ‘మా ఆయన మూడ్రోజులుగా ఇంటికి రావడంలేదు. పెళ్లయిన నాటి నుంచి ఎప్పుడూ ఇలా జరగలేదు. ఆయనకేమైందో ఏంటో..’,.. మెక్సికోలో రోజురోజుకీ ఇలాంటి డైలాగులు పెరిగిపోతున్నాయి.

రంగంలోకి సైన్యం…

డ్రగ్స్ మాఫియాకు చెందిన పలు గ్రూపుల మధ్య జరిగిన గ్యాంగ్ వార్‌లో.. 2018 సంవత్సరంలో మెక్సికోలో 28,711 హత్యలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ గ్యాంగ్ వార్‌లకు పాల్పడుతున్న గ్రూపులను అణిచివేసేందుకు అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఈ గ్యాంగ్ వార్స్‌లో 2006 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల మందికిపైగా ప్రాణాలుకోల్పోగా.. మరో 30 వేల మంది కనిపించకుండా పోయారు.

గ్యాంగ్ వార్‌లో మరణించిన వారిని ఆయా గ్రూపులు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో పూడ్చి పెడుతున్నాయి. వెరాక్రజ్‌‌లో శవాల దిబ్బగా పిలుస్తున్న ప్రదేశంలో 400 నుంచి 500 మంది మృతదేహాలు ఉండొచ్చని బాధిత కుటుంబాలు అనుమానిస్తున్నాయి. వెరాక్రజ్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలినాస్ డి శాంటాఫే అనే ప్రదేశంలో కూడా ఇప్పటి వరకు 296 మృతదేహాలు లభించినట్లు అధికారులు చెబుతున్నారు.

- Advertisement -