
వైజాగ్: ఐపీయల్ లో మరో రసవత్తకర పోరుకి రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో ఓడితే మరో అవకాశం లేదు. అలాగని గెలిచిన వారు డైరెక్ట్ ఫైనల్ కి వెళ్తారా అంటే అది కూడా లేదు. గెలిస్తే , ఫైనల్ లో అడుగుపెట్టాలి అంటే మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. నేడే దిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఐపీఎల్-12 ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది . విశాఖపట్నం వేదికగా దిల్లీతో అమీతుమీ తేల్చుకునేందుకు హైదరాబాద్ సిద్ధమైంది.
అదృష్టంతో ఉండడంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన సన్‌రైజర్స్, ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతుందనేది ఆసక్తిని పెంచుతుంది. మరోవైపు రబాడ లాంటి కీలక బౌలర్ సేవలను కోల్పోయిన దిల్లీ, హైదరాబాద్‌ను ఎలా నిలువరిస్తుందో చూడాలి.
వార్నర్, బెయిర్‌స్టో దూరమైనప్పటికీ అదృష్టం కలిసొచ్చి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన సన్‌రైజర్స్.. స్ఫూర్తిదాయ ప్రదర్శనతో లీగ్ దశ దాటిన దిల్లీని ఓడించాలంటే చాలా కష్టపడాల్సిందే. మ్యాచ్‌లో ఫేవరెట్ డీసీనే అనడంలో సందేహం లేదు. కానీ టీ20ల్లో ఎలాంటి ఫలితమైనా రావచ్చు కాబట్టి సన్‌రైజర్స్ అవకాశాల్ని కొట్టిపారేయలేం.
చివరి లీగ్ మ్యాచ్‌లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ సన్‌రైజర్స్‌తో పాటు ఫామ్‌లో ఉన్న మనీష్ పాండే, మహ్మద్ నబి, రషీద్ ఖాన్‌లపై సన్‌రైజర్స్ ఆశలు పెట్టుకుంది. మరోవైపు దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు శిఖర్ ధావన్, రిషబ్ పంత్, బౌల్ట్, ఇషాంత్‌లను నమ్ముకుంది.
ఐపీఎల్ చరిత్రలో 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు వచ్చిన తొలి జట్టు సన్‌రైజర్సే. లీగ్ దశలో సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించిన వార్నర్, బెయిర్‌స్టో జట్టును వీడటం సన్‌రైజర్స్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేదే. ఈ స్థితిలో విలియమ్సన్ జట్టును ముందుండి నడిపించడం కీలకం.








