
ఢిల్లీ: రెండు సీజన్ల నుంచి ఢిల్లీపై విజయం సాధించని ముంబై ఇండియన్స్, ఎట్టకేలకు ఘనవిజయంతో పరాజయాలకు ముగింపు పలికింది. యంగ్ ఢిల్లీ టీమ్‌ను 40 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 200కు పైగా భారీ స్కోరును చేధించి, రికార్డు క్రియేట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, కష్టసాధ్యం కాని 169 పరుగుల లక్ష్యాన్ని ఎంతో తేలిగ్గా కొట్టేస్తుందని అనుకున్నారు అభిమానులు.
అయితే అంచనాలను తలకిందులు చేస్తూ ఢిల్లీ, ముంబై చేతిలో చిత్తుగా ఓడింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 128 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీషా చక్కగా బ్యాటింగ్ చేయడంతో ఆరంభంలో స్కోరు బోర్డు బాగానే పరుగులు పెట్టింది. అయితే మొదటి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 35 పరుగులు చేసిన శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత పృథ్వీషా కూడా 20 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో ఢిల్లీ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు. కోలిన్ మున్రో 3, శ్రేయాస్ అయ్యర్ 3, పంత్ 7 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. 76 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఢిల్లీ. అయితే క్రిస్ మోరిస్, అక్షర్ పటేల్ కలిసి కాసేపు పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
కానీ 11 పరుగులు చేసిన క్రిస్ మోరిస్‌ను మలింగ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కీమో పాల్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. 26 పరుగులు చేసిన అక్షర్ పటేల్‌ను బుమ్రా బౌల్డ్ చేయడంతో ఢిల్లీ పరాజయం ఖాయమైపోయింది. రబాడా 9 పరుగులు చేసి చివరి ఓవర్లో అవుట్ కాగా, అమిత్ మిశ్రా 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
చదవండి: సన్‌రైజర్స్ ఆటగాళ్ల ‘గల్లీ క్రికెట్








