25.6 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home క్రికెట్ మూడో వన్డే: పోరాడి ఓడిన ఇండియా! కోహ్లీ పోరాటం వృథా…

మూడో వన్డే: పోరాడి ఓడిన ఇండియా! కోహ్లీ పోరాటం వృథా…

- Advertisement -

రాంచీ: కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (123; 95 బంతుల్లో 16×4, 1×6) అలవోకగా శతక్కొట్టినా అతడికి సరైన సహకారం లభించకపోవడంతో భారత్‌కు భంగపాటు తప్పలేదు. శుక్రవారం మూడో వన్డేలో ఆస్ట్రేలియా 32 పరుగుల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.

చెలరేగిన ఫించ్‌, ఖవాజా

ఓపెనర్లు ఖవాజా (104; 113 బంతుల్లో 11×4, 1×6), ఫించ్‌ (93; 99 బంతుల్లో 10×4, 3×6) చెలరేగడంతో మొదట ఆసీస్‌ 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. కోహ్లి అద్భుతంగా బ్యాటింగ్‌ చేసినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవడతో ఛేదనలో భారత్‌ 48.2 ఓవర్లలో 281 పరుగులకే ఆలౌటైంది. కమిన్స్‌ (3/37), రిచర్డ్‌సన్‌ (3/37), జంపా (3/70) భారత్‌ను దెబ్బ తీశారు. ఖవాజాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

లక్ష్యఛేదనలో భారత్‌కు బలమైన ఆరంభం అవసరం కాగా.. ఓపెనర్లు మరోసారి నిరాశపరిచారు. 15 పరుగులకే ధావన్‌ (1), రోహిత్‌ (14) పెవిలియన్‌ చేరారు. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ అంబటి రాయుడు (2) కూడా విఫలమయ్యాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో బౌల్డై వెనుదిరిగాడు.

ఐతే కోహ్లి అదిరే బ్యాటింగ్‌తో జట్టును రేసులో నిలిపాడు. త్వరగానే వికెట్లు పోయినా ఏమాత్రం ఒత్తిడి లేకుండా సాధికారికంగా, స్వేచ్ఛగా చెలరేగిపోయాడు. కళ్లుచెదిరే కవర్‌డ్రైవ్‌లు, ముచ్చటైన ఆన్‌డ్రైవ్‌లతో వీక్షకులను ఉర్రూతలూగించాడు. జట్టు ఆశలను మోస్తూ కోహ్లి అన్నివైపులా అలవోకగా బౌండరీలు బాదేశాడు.

52 బంతుల్లో అర్ధశతకం సాధించిన అతడు.. శతకం పూర్తి చేయడానికి మరో 33 బంతులే తీసుకున్నాడు. బాగానే ఆరంభించిన ధోని (26; 42 బంతుల్లో 2×4, 1×6), జాదవ్‌ (26; 39 బంతుల్లో 3×4) ఇంకాస్త బాధ్యతగా ఆడుంటే పరిస్థితి భిన్నంగా ఉండేదే. కోహ్లితో నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించి భారత్‌ కోలుకోవడానికి సహకరించిన ధోని.. కీలక సమయంలో జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి బౌల్డయ్యాడు.

- Advertisement -