
హైదరాబాద్, 2 సెప్టెంబరు 2026: ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సెలబ్రిటీల పాలిట శాపంగా మారింది. వారి ముఖాలు ఉపయోగించి వారికి సంబంధం లేని ఫొటోలు, వీడియోలు రూపొందించి కొందరు వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అవి నిజమే అనుకుని పలువురు నెటిజన్లు వాటిని డౌన్లోడ్ చేయడం, షేర్ చేయడం చేస్తున్నారు.
గతంలో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, శ్రుతిహాసన్, టబు, ఐశ్వర్య రాయ్ బచ్చన్ తదితర హీరోయిన్ల పేర్లతోనూ డీప్‌ఫేక్ కంటెంట్ నెట్టింట వైరల్ అయింది. తాజాగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ శాలినీ పాండే కూడా ఒక ఫేక్ ఏఐ వీడియో బారిన పడింది. దీంతో సెలబ్రిటీల డిజిటల్ భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.
శాలినీ పాండే 2017లో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఆ తరువాత ‘మహానటి’, ‘118’, ‘జయేష్‌భాయ్ జోర్దార్’, ‘మహారాజ్’ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం తెలిసిందే.
ప్రస్తుతం ఆమె పేరుతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అందులో ఉన్నది తాను కానే కాదని, తాను కూడా డీప్‌ఫేక్ బారిన పడ్డానని ఆమె తాజాగా వెల్లడించింది.
తన పేరుతో నెట్టింట ఓ ఫేక్ వీడియో హల్చల్ చేస్తుండడంతో దానిపై స్పందించక తప్పలేదు ఈ ముద్దుగుమ్మకి. తన పేరుతో చక్కర్లు కొడుతున్న ఆ వీడియో పూర్తిగా నకిలీదని, ఏఐ టెక్నాలజీని సహాయంతో రూపొందించిందని ఆమె స్పష్టం చేసింది.
మహిళలను, ముఖ్యంగా సెలబ్రిటీలను కించపరిచేలా ఇలాంటి ఫేక్ వీడియోలను రూపొందించడం అత్యంత దారుణమని శాలినీ పాండే ఆవేదన వ్యక్తం చేసింది.
తన పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోన్న వీడియోను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. అలాంటి వీడియోలు కనిపించినప్పుడు వాటిని డౌన్లోడ్ చేయకుండా, షేర్ చేయకుండా నెటిజన్లు బాధ్యతగా వ్యవహరించాలని ఆమె కోరింది.
ఫేక్ కంటెంట్‌ను షేర్ చేయడం వల్ల అది మరింత మందికి చేరే అవకాశం ఉంటుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత త్వరగా తన వీడియో గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రిపోర్ట్ చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది.
ఏఐ టెక్నాలజీ ఇలా దుర్వినియోగం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.








