
వైసీపీలోని కొందరు నేతలు ప్రజలకు పెద్ద పెద్ద నీతులు చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందని ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. ఎంతటి నేరాలు చేసిన నేతలైనా సరే, వారు ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవాలని, అవి ఏమాత్రం సరికాదని ఆమె తోసిపుచ్చారు.
“సొంత చెల్లిని పరామర్శించలేని వ్యక్తి జగన్!”
ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్‌పై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “మేం కష్టపడి చేసిన సంక్షేమం, అభివృద్ధి పనులకు జగన్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. అసలు ఆయనకు ఎలాంటి క్రెడిట్ లేదు.. ఇక క్రెడిట్ చోరీ ఎక్కడ? ‘క్రెడిట్’ అనే పదం జగన్‌కు ఏమాత్రం వర్తించదు. ఆయనకు తెలిసిన క్రెడిట్ అల్లా.. నాలుగు కత్తులు, నాలుగు గొడ్డళ్లు మాత్రమే! హత్యలు, దౌర్జన్యాలు చేసిన వారిని వెనుకేసుకు రావడం, అసభ్యకరంగా బూతులు మాట్లాడే వారికి మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించడమే ఆయన నైజం” అని మండిపడ్డారు.
అంతేకాకుండా సొంత కుటుంబం పట్ల జగన్ వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ.. “శస్త్రచికిత్స (సర్జరీ) చేయించుకున్న సొంత చెల్లెలిని కనీసం పరామర్శించే మనసు లేని జగన్.. నేరాలు చేసి జైళ్లల్లో మగ్గుతున్న క్రిమినల్స్‌ని మాత్రం వెెళ్లి పరామర్శిస్తున్నారు” అని సంధ్యారాణి ఎద్దేవా చేశారు.








