24.9 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం వర్గపోరు, రైతుల ఆగ్రహంతో దతియాలో బీజేపీ బలి!

వర్గపోరు, రైతుల ఆగ్రహంతో దతియాలో బీజేపీ బలి!

- Advertisement -

మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితం అధికార భారతీయ జనతా పార్టీ (BJP)కి ఊహించని పెద్ద షాక్ ఇచ్చింది. సీనియర్ నాయకుడు, మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాను పక్కనపెట్టి, కొత్త ముఖం అశుతోష్ తివారీని బరిలోకి దించినప్పటికీ బీజేపీకి ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ అభ్యర్థి కుంవర్ ఘనశ్యామ్ సింగ్ 6,016 ఓట్ల తేడాతో విజయం సాధించి దతియా స్థానాన్ని కాంగ్రెస్ ఖాతాలోనే నిలుపుకున్నారు.

2023 సాధారణ ఎన్నికల్లో దతియా నుంచి కాంగ్రెస్ నేత రాజేంద్ర భారతీ విజయం సాధించారు. అయితే, ఒక బ్యాంక్ మోసం కేసులో ఢిల్లీ కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది.

మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాపై వ్యతిరేకత ఉందన్న భావనతో బీజేపీ ఈసారి కొత్త అభ్యర్థి అశుతోష్ తివారీకి టికెట్ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం పార్టీలో కార్చిచ్చు రగిల్చింది. నరోత్తమ్ మిశ్రా మద్దతుదారులు రహదారులను దిగ్బంధించి నిరసనలు తెలిపారు. ఆ తర్వాత మిశ్రా ప్రచారం చేసినప్పటికీ, పాత క్యాడర్ కొత్త అభ్యర్థిని మనస్ఫూర్తిగా ఆమోదించలేదు. ఎంతగా అంటే.. నరోత్తమ్ మిశ్రా స్వగ్రామం, ఆయన బలమైన కోటగా భావించే 121వ నంబర్ పోలింగ్ బూత్‌లోనే బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు రావడమే ఇందుకు నిదర్శనం.

మరోవైపు విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీలోనూ విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర భారతీని కౌంటింగ్‌కు ఒక్కరోజు ముందే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.

అయినప్పటికీ, గ్రామీణ ప్రాంతాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. అకాల వర్షాలు, ఎరువుల కొరత, నిరుద్యోగం, ఓబీసీ రిజర్వేషన్ల అంశాలపై రైతులు, యువతతో చేసిన ప్రచారం బాగా పనిచేసింది. దతియా పట్టణ ప్రాంతాల్లో 62 శాతం ఓటింగ్ నమోదు కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 78 శాతం పోలింగ్ జరగడం కాంగ్రెస్ విజయానికి గట్టి పునాది వేసింది.

ఈ గెలుపుపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేస్తూ.. ఇది 2028 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఓటమికి నాంది అని వ్యాఖ్యానించగా, బీజేపీ ఈ పరాజయంపై లోతైన సమీక్ష జరుపుతామని వెల్లడించింది.

- Advertisement -