
చెన్నై: సీనియర్ నటీమణి, కళాభినేత్రి వాణిశ్రీ ఇంట్లో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఆమె కుమారుడు అభినయ వెంకటేష్ కార్తీక్(36) బలవన్మరణానికి పాల్పడ్డారు.
అభినయ్ బెంగళూరులోని అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ మధ్యనే తిరుక్కలికుండ్రంలోని ఓ బంగ్లాను ఆయన కొనుగోలు చేశారు.
కరోనా లాక్డౌన్ కారణంగా బయటికి వెళ్లలేని పరిస్థితి ఉండడంతో కొంతకాలంగా ఆయన అదే బంగ్లాలో ఉంటున్నారు. ఇప్పుడు అదే ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
ఆయన ఆత్మహత్యకు మానసిక ఒత్తిడే కారణమై ఉండొచ్చని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వారు అభినయ్ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం చంగల్పట్టు ఆసుపత్రికి తరలించారు.
తెలుగు చిత్ర సీమలో కథానాయికగా ఓ వెలుగు వెలిగారు కళాభినేత్రి వాణిశ్రీ. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల్లోనూ తన ప్రతిభ చూపించారు. తెలుగులో అయితే 70, 80వ దశకాల్లో అగ్రశ్రేణి నటిగా వెలుగొందారు.
ఆమె తన ఫ్యామిలీ డాక్టర్నే పెళ్లి చేసుకుని, ఆ తర్వాత సినీ రంగం నుంచి తప్పుకున్నారు. వాణిశ్రీకి ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమార్తె పేరు అనుపమ.
కొడుకు, కూతురు ఇద్దరూ వైద్య విద్యను అభ్యసించారు. అభినయ్ భార్య కూడా వైద్యురాలే. ఆమె సావిత్రి మనుమరాలి ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.
వాణిశ్రీ పిల్లలు సినీరంగానికి దూరంగానే ఉన్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్లో వాణిశ్రీ మళ్లీ అత్త, తల్లి పాత్రలు వేస్తూ వెండి తెర మీద కొద్దికాలమే కనిపించారు.
ఇప్పుడు కుమారుడు అభినయ్ హఠాన్మరణంతో వాణిశ్రీ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. ఈ వార్త తెలియగానే సినీ ప్రముఖులు వాణిశ్రీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అభినయ్ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు.
తొలుత అభినయ్ గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వెలువడినప్పటికీ, ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారణ అయింది.
శుక్రవారం రాత్రి కూడా తన కుమారుడితో సరదాగా గడిపిన ఆయన ఉదయానికల్లా విగతజీవి కావడమే మిస్టరీగా మారింది.








