
అమరావతి: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే గ్రామ వాలంటీర్లను నియమించినట్లు ప్రకటించిన జగన్ ప్రభుత్వం.. కరోనా సాయం రూ.1000 లబ్ధాదారులకు ఇవ్వడంలో మాత్రం వారి సేవలను ఎందుకు వినియోగించుకోవడం లేదని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోన్న కరోనా సాయాన్ని వైసీపీ నేతలు, కార్యకర్తలే పంచుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గ్రామ వాలంటీర్లు ఉన్నది ఎందుకు? వైసీపీ నేతలకు దండాలు పెట్టడానికా? అని ప్రశ్నించారు.
చదవండి: కష్టాల్లో ఉన్నారు.. భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు ఇవ్వాలి: జగన్కు లోకేష్ లేఖ
ఈ మేరకు చంద్రబాబు నాయుడు తాజాగా ఒక ట్వీట్ చేశారు. గ్రామ వాలంటీర్లకు ప్రజాధనం నుంచే జీతం ఇస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. వారిని విధుల్లోంచి తొలగించడం కూడా సరైంది కాదన్నారు.
విజయనగరం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం గెడ్డతిరువాడకు చెందిన బొంగు కార్తీక్, గోపిశెట్టి ఝాన్సీలను అక్కడి వైసీపీ నేతల మాట వినకపోవడం వల్లే విధుల్లోంచి తొలగించారని చంద్రబాబు ఆరోపించారు.
గ్రామ వాలంటీర్లను అన్యాయంగా తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించిన ఆయన గ్రామ వాలంటీర్ల విషయంలో వైసీపీ నేతల వైఖరి సరికదన్నారు.
ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడానికే అని చెప్పి వాలంటీర్లను పెట్టుకున్నారు.ప్రజాధనంతో వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. అలాంటప్పుడు కరోనా సాయం కింద ఇచ్చే 1000 రూపాయలను వైసీపీ నేతలు ఇస్తాననడం ఏంటి? కాదన్న వాలంటీర్లను విధుల్లోంచి తొలగించడం ఏంటి? వాళ్ళున్నది ప్రజల కోసమా? పార్టీకోసమా?(1/2) pic.twitter.com/xiARqc9dJ2
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) April 25, 2020








