
లండన్: బంగ్లాదేశ్ జట్టు పసికూన కాదని మరోసారి రుజువు చేసుకుంది. తనదైన రోజు ఎంతటి జట్టునైనా మట్టికరిపిస్తామని రుజువు చేసింది. మెగా టోర్నీలలో ఎప్పుడు ఏదొక పెద్ద జట్టుకి షాక్ ఇచ్చే బంగ్లా జట్టు…ఈ వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా(సఫారీ) జట్టుకి ఊహించని షాక్ ఇచ్చింది.
లండన్‌లోని ది ఓవల్ మైదానంలో జరిగిన వరల్డ్ కప్ 5వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన సఫారీలు బంగ్లాదేశ్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. బంగ్లా జట్టు బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయి ఆడారు.
ఆ జట్టులో ముష్ఫికుర్ రహీం (78), షకిబ్ అల్ హసన్ (75), మహ్మదుల్లా (46),సౌమ్య సర్కార్(41)పరుగులతో రాణించడంతో బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోరు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో పెహ్లుక్వాయో, క్రిస్ మోరిస్, ఇమ్రాన్ తాహిర్‌లకు తలా 3 వికెట్లు దక్కాయి.
రాణించిన బంగ్లా బౌలర్లు…
ఇక 331 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీ జట్టు నిలకడగా ఆడుతూ..టార్గెట్‌వైపు పయనించారు కానీ…కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి పాలయ్యారు. దీంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 309 పరుగులు మాత్రమే చేసి 21పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఆ జట్టు బ్యాట్స్మెన్లలో కెప్టెన్ డుప్లెసిస్ (62) ఫర్వాలేదనిపించగా, మార్క్రం (45 పరుగులు), వాన్ డర్ డుస్సెన్ (41 పరుగులు), జేపీ డుమినీ (45 పరుగులు)లు కొంత సేపు క్రీజులో నిలబడ్డారు.
బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రహీంకు 3 వికెట్లు దక్కగా, మహమ్మద్ సైఫుద్దీన్‌కు 2, మెహిదీ హసన్, షకిబ్ అల్ హసన్‌లకు చెరో వికెట్ దక్కింది. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న షకీబ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.
కాగా,వరల్డ్ కప్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.








