
కర్ణాటక: ప్రస్తుతం వెడ్డింగ్ కార్డులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కొద్దీ కొద్దిగా పెళ్లి ఆహ్వానాలు ట్రెండ్ మార్చుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ ప్రింట్ వేయించిన పెళ్లి పత్రికలు ఇప్పటికే వైరల్ గా మారాయి.
మొన్నటికి మొన్న ఓటర్ ఐడీ తరహాలో ముద్రించిన మ్యారేజ్ ఇన్విటేషన్లు అందరికి ఆసక్తిని కలిగించాయి. అలాగే ఆలోచింపజేశాయి కూడా. తాజాగా తన పెళ్లికి రావాలంటూ ఓ బాటనీ లెక్చరర్ పంచిన వివాహా ఆహ్వాన పత్రికలు ప్రస్తుతం చర్చానీయాంశంగా మారాయి.
వెడ్డింగ్ కార్డు వినూత్నంగా ఉండాలనే…
పూర్తి వివరాలు చూస్తే… కర్ణాటకలోని బళ్లారికి చెందిన సాయి సందీప్ స్థానికంగా ఓ కాలేజీలో బోటనీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. అదే కాలేజీలో పనిచేస్తున్న మరో లెక్చరర్ తేజస్వినితో ఈ మద్యే ఆయనకి పెళ్లి కుదిరింది.
అయితే మే 9వ తేదీన జరగనున్న తమ పెళ్లికి వెడ్డింగ్ కార్డు వినూత్నంగా ఉండాలనే ఆలోచనతో సరికొత్తగా ఆలోచించాడు. అసలే ఇప్పుడు ఎండాకాలం కావడంతో బంధువులకు తామిచ్చే పెళ్లి పత్రిక ఉపయోగపడాలని భావించాడు.
అలా వాటర్మిలన్స్ మీద వివాహానికి సంబంధించిన వివరాలు ముద్రించిన స్టిక్కర్ అతికించి బంధుమిత్రులకు ఇచ్చాడు. పెళ్లి కోసం 1000 కుటుంబాలకు ఆహ్వాన పత్రికలు అందించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అలా రోజుకు 100 కుటుంబాల చొప్పున వివాహ పత్రికలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
అయితే పుచ్చకాయలను రోజుకు 100 చొప్పున కొనుగోలు చేస్తూ బంధుమిత్రులకు పంపిణీ చేస్తున్నారు. తమ ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని సాయి సందీప్ హర్షం వ్యక్తం చేశారు. ఎంత ఖరీదైన పెళ్లి పత్రిక ఇచ్చినప్పటికీ ఇలా చూసి అలా పడేస్తారని, అదే తామిచ్చిన వాటర్ మెలన్ తిని పెళ్లిరోజు కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారని చెబుతున్నారు.








