24.6 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home క్రికెట్ ఒకే ఒక్కడు: ఐసీసీ అవార్డులు క్లీన్‌ స్వీప్ చేసిన కోహ్లీ, ‘ఎమర్జింగ్ ప్లేయర్’గా పంత్

ఒకే ఒక్కడు: ఐసీసీ అవార్డులు క్లీన్‌ స్వీప్ చేసిన కోహ్లీ, ‘ఎమర్జింగ్ ప్లేయర్’గా పంత్

virat kohli
- Advertisement -

virat kohli

న్యూఢిల్లీ: ఐసీసీ అవార్డులను క్లీన్ స్వీప్ చేసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ప్రకటించిన సర్‌ గ్యారీఫీల్డ్ సోబర్స్‌‌ ట్రోఫీ ఫర్‌ ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌, ఐసీసీ వన్డే క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌.. ఈ మూడు
అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించాడు.

పరుగుల యంత్రం కోహ్లీ ఇటీవలి రికార్డులు ఒక్కసారి పరిశీలించినట్లయితే.. 2018లో 13 టెస్టు మ్యాచుల్లో.. 55.08 సగటుతో 1322 పరుగులు చేశాడు. వాటిలో ఐదు శతకాలుండటం గమనార్హం. 14 వన్డే మ్యాచుల్లో.. 133.55 సగటుతో 1202 పరుగులు సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు.

కోహ్లీ వరుసగా రెండో ఏడాది కూడా వన్డే క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌, క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌ అవార్డులను గెలుచుకోగా, తొలిసారి టెస్టు క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌ అవార్డును సైతం సొంతం చేసుకోవడం విశేషం.

‘2018లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ చూపిన అద్భుత ప్రదర్శనకుగాను ఐసీసీ టెస్టు, వన్డే జట్టులకు కెప్టెన్‌గా అతని పేరును ప్రకటించాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. పరుగుల పరంగానే కాకుండా 2018లో టీమిండియాను విజయపథంలో నడిపిన తీరుకూ రివార్డు దక్కిందని తెలిపింది.

ఐసీసీ అవార్డులు రావడంపై కోహ్లీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘కష్టానికి ఫలితం దక్కింది. ఎంతో ఆనందంగా వుంది. అవార్డులను క్లీన్‌స్వీప్‌ చేసినందుకు గర్వంగా ఉంది..’  అని వ్యాఖ్యానించాడు. ఇదిలావుంటే.. ఓ అసాధారణమైన ప్రతిభకు దక్కిన గౌరవమని కోహ్లీని ఉద్దేశిస్తూ ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ పేర్కొన్నారు.

చరిత్ర సృష్టించిన టీమిండియా…

71 ఏళ్లలో ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడంతో పాటు, వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచి టీమిండియా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇక, భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను.. ‘ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌’ అవార్డు వరించింది. ఆస్ట్రేలియా పర్యటనలో పంత్ ఉత్తమ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ ఆరోన్‌ ఫించ్.. ఐసీసీ టీ20 ఫెర్ఫార్మెన్స్‌‌ ఆఫ్ ది ఇయర్‌ 2018, కేన్‌ విలియమ్సన్‌.. ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్‌, శ్రీలంక అంపైర్‌ ధర్మసేన.. డేవిడ్ షెఫర్డ్ ట్రోఫీ, స్కాలాండ్‌కు చెందిన కాలమ్ మెక్‌లీయోడ్.. ఐసీసీ అసోసియేట్ క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌ 2018 అవార్డులను గెలుచుకున్నారు.

- Advertisement -