కేసీఆర్‌కు భారీ షాక్.. టీఆర్ఎస్‌లో సబిత చేరకుండా చక్రం తిప్పిన రేవంత్!

- Advertisement -

హైదరాబాద్: తనను ఇబ్బందులకు గురిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి గట్టి షాకిచ్చారు.

కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని టీఆర్ఎస్‌లోకి లాక్కోవడం ద్వారా రంగారెడ్డి జిల్లాలో ఆ పార్టీని నామరూపాల్లేకుండా చేయాలన్న కేసీఆర్ కుటిల యత్నానికి రేవంత్ రెడ్డి అడ్డుగోడలా నిలిచారు. 

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చొరవతో…

ఆదివారం ఎంపీ అసదుద్దీన్ నివాసంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ఎంపీ కవితతో చర్చలు జరిపారు. దీంతో వీరిద్దరూ టీఆర్ఎస్‌ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.

సబితా ఇంద్రారెడ్డి అనుచరులు కూడా ఆమె టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వెలిబుచ్చగా.. ఆమె నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమని.. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటామని టీఆర్ఎస్‌కు చెందిన పలువురు నేతలు, కార్పొరేటర్లు కూడా వెల్లడించారు. కొందరు సబిత నివాసానికి వెళ్లి అభినందనలు కూడా తెలిపారు. 

మొత్తం మీద ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చొరవతో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. సోమవారం రాత్రి సబిత, ఆమె తనయుడు కార్తీక్‌తో రేవంత్ రెడ్డి భేటీ తర్వాత సబిత మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.

రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి…

రేవంత్ రెడ్డి కుటుంబానికి సబిత కుటుంబంతో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. నిజానికి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం వెనక సబిత పాత్ర కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సబిత కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు తెలియగానే రంగంలోకి దిగిన రేవంత్ సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు ఆమెను బుజ్జగించారు.

అదే సమయంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేత ఫోన్ కూడా చేయించడంతో సబిత మెత్తబడినట్టు సమాచారం.  ఈ నేపథ్యంలో మంగళవారం రేవంత్‌రెడ్డితో కలిసి సబిత కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీని కలవబోతున్నట్టు కూడా తెలుస్తోంది.

కాంగ్రెస్‌పై ఆగ్రహంతోనే టీఆర్ఎస్ వైపు…

కాంగ్రెస్ పెద్దలు చేవెళ్ల ఎంపీ సీటును తన కుమారుడు కార్తీక్ రెడ్డికి ఇవ్వకుండా విశ్వశ్వర్ రెడ్డికి ఇవ్వడంపై సబిత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కార్తీక్ రెడ్డి రాజేంద్రనగర్ స్థానం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు.

ఎమ్మెల్యే టికెట్‌తో పాటు చేవేళ్ల ఎంపీ టికెట్ కూడా దక్కకుండాపోవడంపై కార్తీక్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందినట్టు సమాచారం. వీరి అసంతృప్తిని గమనించిన టీఆర్ఎస్.. సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవితో పాటు కార్తీక్ రెడ్డికి కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చి తమ పార్టీవైపు లాక్కోవాలని చూసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

మరోవైపు కాంగ్రెస్‌ అధిష్ఠానంపై అలకబూనిన సబిత టీఆర్ఎస్‌లోకి జంప్ కావాలని యోచించినట్టు సమాచారం. అయితే, రేవంత్ రెడ్డి రంగ ప్రవేశంతో కథ అడ్డం తిరిగింది. దీంతోపాటుగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కూడా ఫోన్ చేసి మాట్లాడడంతో సబిత, కార్తీక్‌ మెత్తబడ్డారని, దీంతో వారు తమ అలకవీడి కాంగ్రెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

- Advertisement -