హస్త విలాపం: 8వ వికెట్ డౌన్, టీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కేటీఆర్‌తో భేటీ

LB Nagar MLA Sudheer Reddy crosses over to TRS, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీ దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధం కాగా, ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా గులాబీకి గూటికి చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.

అంతేగాక, టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆయన నివాసంలో శుక్రవారం కలిశారు. దాదాపు గంటసేపు వీరి సమావేశం జరిగింది. తన నియోజకవర్గమైన ఎల్బీనగర్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించినట్లు తెలిసింది.

సుధీర్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించిన కేటీఆర్..

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేగాక, హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోందని చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించి, అఖండ విజయాన్నందించారని చెప్పారు.

కాగా, సుధీర్ రెడ్డి నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు. సరైన నిర్ణయం తీసుకున్నారంటూ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే రెండు మూడు రోజుల్లో సీఎం కేసీఆర్‌తో సుధీర్ రెడ్డి భేటీ కావాలని నిర్ణయించుకున్నారు.

ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్ పూర్తిస్థాయి హామీ ఇచ్చారని సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఎల్బీనగర్ చెరువుల సుందరీకరణ, బీఎన్ రెడ్డి కాలనీలో రిజిస్ట్రేషన్ సమస్య, ఎల్బీనగర్ ఆస్తి పన్ను సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారని తెలిపారు. నగరంలోని రహదారులు, ట్రాఫిక్ సమస్యపై చర్చించినట్లు తెలిపారు.

ఇది ఇలా ఉండగా, ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.

- Advertisement -