ఆటోలో 24 మంది.. షాకైన కరీంనగర్ పోలీసులు!

8:43 am, Mon, 12 August 19

కరీంనగర్: సాధారణంగా ఆటోలో ఎంతమంది ప్రయాణిస్తారు? డ్రైవర్‌తో కలుపుకుని నలుగురు. కాస్త, పెద్ద ఆటో అయితే ఆరుగురు. కానీ ఈ ఆటోలో మాత్రం ఏకంగా 24 మంది కూర్చుని బయలుదేరారు. ఇది చూసిన పోలీసులే విస్తుపోయారు. ఆటోలో అంతమంది ఎక్కినందుకు కాదు.. అంతమంది ఎలా కూర్చున్నారా? అని.

కారులో కూడా ఆరుగురి కంటే ఎక్కువ పట్టరు.. అలాంటిది ఓ వ్యానులో పట్టినంతమందిని తన ఆటోలో ఒద్దికగా ఎక్కించేసిన ఆ డ్రైవర్ ప్రతిభకు పోలీసులు షాకయ్యారు. కరీంనగర్‌లో జరిగిందీ ఘటన.డ్రైవర్‌ను చూసి షాకైన పోలీసులు.. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. చివరికి ‘ఆటోలో ఎంతమందిని ఎక్కించుకోవాలిరా.. నాయనా?’ అని ప్రశ్నించారు.

ఆరుగురు అని సమాధానమిచ్చాడు. మరి ఎంతమంది ఉన్నారో చూద్దామని, దిగాలని వారిని కోరగా, పుట్టల్లోంచి బయటికొచ్చిన చీమల్లా ఏకంగా 24 మంది లెక్కతేలారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసిన పోలీసులు ‘సీపీ కరీంనగర్’ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

తాము ఓ ఫంక్షన్‌కు వెళ్తున్నామని, తమను వదిలిపెట్టాలని ఆటోలోని మహిళలు పోలీసులను వేడుకోవడం కనిపించింది. అందరినీ వరుసగా నిల్చోబెట్టిన పోలీసులు వారికి క్లాస్ తీసుకున్నారు. పరిమితికి మించి ప్రయాణించడం వల్ల ప్రమాదాలకు గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు.