ఉదయం చనిపోయి.. ఆపై బతికి.. రాత్రికి మృతి చెందిన మాజీ సీఎం భార్య

9:23 am, Mon, 12 August 19
గురుగ్రామ్: హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా భార్య స్నేహలత (81) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ వెంటనే ఆమె కోలుకున్నారు. కానీ, ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందారు.

గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్నేహలత మృతి విషయంలో ఆదివారం హైడ్రామా చోటుచేసుకుంది. ఉదయం ఆమె మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. విషయం తెలిసిన ఆమె కుమారుడు అభయ్‌సింగ్ చౌతాలా బహిరంగ సభలో తన ప్రసంగాన్ని ఆపి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. 

అయితే, ఆయన వెళ్లేసరికి స్నేహలత కోలుకున్నారు. చనిపోయిందనుకున్న తల్లి బతికే ఉండడంతో అభయ్ సంతోషపడ్డారు. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. రాత్రి 8.25 గంటల సమయంలో ఆమె కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు.