అమరావతి: ‘‘బలవంతపు భూసేకరణను అంగీకరించేది లేదు.. ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ భయపడొద్దు.. నేను అండగా ఉంటా.. ప్రభుత్వం మరో బషీర్‌బాగ్‌ను చేయాలనుకుంటే పోలీసుల తూటాకు ముందు నా గుండె చూపుతా…’’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రైతులకు భరోసా ఇచ్చారు. ఆదివారం ఉండవల్లికి చెందిన పలువురు రైతులు పవన్‌ను కలిసి తమ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తోందంటూ వివరించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… రైతులు ఇస్తేనే ప్రభుత్వం భూములు తీసుకోవాలని, వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు భూములిచ్చిన రైతులు నేటికీ పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు ఇష్టం లేకుండా భూములు తీసుకుంటే వారి తరపున అండగా నిలబడి పోరాటం చేస్తానన్నారు.
గ్రామసభలు పెట్టి అందరి అనుమతితో భూములు తీసుకోవాలని, భూములను కొద్దిమంది చేతిలో పెట్టడాన్ని జనసేన వ్యతిరేకిస్తుందని పవన్అ కళ్యాణ్ చెప్పారు. అవసరానికి మించి భూములు తీసుకోవద్దని, అసైన్డ్ భూములకూ భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని పవన్ వ్యాఖ్యానించారు.