ఢిల్లీ: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి సందర్భంగా అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈరోజు విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది.
ఈ సందర్భంగా ఏపీ పోలీసులకు అదనంగా ఫలితాల రోజు కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు. అసలు టీడీపీ నేతలు పోలింగ్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్లతో పాటు జిల్లా కలెక్టర్లను కూడా బెదిరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభమైన చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను ఈసీ దృష్టికి తీసుకొచ్చామని విజయసాయిరెడ్డి తెలిపారు.
చదవండి: అక్కడ టీడీపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం…ఇదిగో లెక్క…!
టీడీపీ నేతలతో చిత్తూరు కలెక్టర్ కుమ్మక్కు
గత నెల 11న పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఎన్నికలు జరిగిన తీరుపై వైసీపీ చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేశారని, ఏడు చోట్ల టీడీపీ నేతలు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నతో కుమ్మక్కు అయి దళితులను ఓటేయడానికి రాకుండా చేశారని మండిపడ్డారు.
అటు రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఆర్వోగా ఉన్న ఓ మహిళా అధికారి మంత్రి పరిటాల సునీతకు తొత్తుగా మారిపోయారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇక టీడీపీ నేతలు అసాంఘిక శక్తులు, గూండాలకు ట్రైనింగ్ ఇచ్చి కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించడం జరిగిందని, ఎక్కడైతే పోలింగ్ ఆపగలరో, టీడీపీకి ఓట్లు తక్కువగా వస్తున్నాయో అక్కడ కౌంటింగ్ ను ఆపాలని, అల్లర్లు చేయాలని వీరికి స్పష్టమైన ఆదేశాలు అందాయని ఆరోపించారు.








